ఖమ్మం జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే..డోంట్ మిస్

ఖమ్మం జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే..డోంట్ మిస్

అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

ఖమ్మం టౌన్​/జూలూరుపాడు, వెలుగు : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ, ఎస్సీ సెల్, బహుజన నాయకులు నిరసన తెలిపారు. తొలుత అంబేద్కర్​ విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీలు నిర్వహించారు. రాస్తారోకోలు చేపట్టారు. అమిత్​ షా దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈసందర్భంగా ఖమ్మంలో కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు  పువ్వాళ్ల దుర్గాప్రసాద్,  జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు బొడ్డు బొందయ్యతోపాటు ఆయాచోట్ల నాయకులు మాట్లాడారు. తక్షణమే కేంద్ర మంత్రి వర్గం నుంచి హోం శాఖ మంత్రి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. 

క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి 

పాల్వంచ, వెలుగు : రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని కేటీపీఎస్ కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్లు పలుకుర్తి వెంకటేశ్వరరావు, మేక ప్రభాకర్ రావు, శ్రీనివాస బాబు అన్నారు. గురువారం పట్టణంలోని కేటీపీఎస్ ఇండోర్ స్టేడియంలో సీఎం కప్ బ్యాట్మెంటన్ పోటీలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలకు 400 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోవడం విశేషమన్నారు.

విద్యార్థులకు చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి ఉంటే భవిష్యత్​ బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి పరంధామరెడ్డి, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, ఒలంపిక్ అసో సియే షన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్ రెడ్డి, కార్యదర్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

చెట్టును నరికినందుకు ఫైన్​

ఖమ్మం టౌన్,వెలుగు :  ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్ లో నివాసం ఉండే ఇంటి యజమాని చెట్టును నరికాడు. దీంతో అతడికి గురువారం హార్టికల్చరల్ అధికారి రాధిక రూ.10 వేలు ఫైన్ విధించారు. 

వ్యక్తి ఆత్మహత్య

తల్లాడ, వెలుగు :  ఫ్యామిలీ గొడవలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తల్లాడ మండలంలో గురువారం జరిగింది. ఎస్సైకొండలరావు  తెలిపిన వివరాల ప్రకారం..  తల్లాడ మండలం నరసరావుపేట సమీపంలోని ఎమ్మెస్సార్ స్టోన్ క్రషర్ లో ఛత్తీస్​గఢ్​ రాష్ట్ర రాయపూర్ జిల్లా మజ్దూర్ నగర్ కు చెందిన బలేంధర్ విశ్వకర్మ (28) టిప్పర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.  భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా ఇటీవల భార్య తన వద్ద నుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన విశ్వకర్మ గురువారం స్టోన్ క్రషర్ సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య  చేసుకున్నాడు. సూపర్​వైజర్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

గుండెపోటుతో బాడీ బిల్డర్ మృతి

పాల్వంచ, వెలుగు : పాల్వంచ పట్టణానికి చెందిన బాడీ బిల్డర్​ షేక్ రసూల్ నాయక్ గురువారంగుండెపోటుతో మృతిచెందారు. ఆప ద్బాంధవుడు, గాయం, అడవిపుత్రులుతో పాటు మరో 4 సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో రసూల్ నాయక్ నటించారు. ఆయనకు బాడీ బిల్డర్ గా, కరాటే మాస్టర్ గా గుర్తింపు ఉంది. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

దళారులను ఆశ్రయించొద్దు

కామేపల్లి, వెలుగు : రైతులు దళారులను ఆశ్రయించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య సూచించారు. గురువారం మండలంలోని కామేపల్లి, కొత్త లింగాల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. 

మొక్కజొన్న విత్తనాలు సీజ్

తల్లాడ, వెలుగు : ఏన్కూర్ లోని ఓ ఇంట్లో స్టాక్ లైసెన్స్ లేకుండా 932 కేజీల మొక్క జొన్న విత్తనాలను నిలువ చేయగా పక్కా ఇన్ఫర్మేషన్​తో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. విత్తనాలను సీజ్ చేసి సొసైటీ గోడౌన్ లో భద్రపరిచారు. సదురు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏవో నరసింహారావు తెలిపారు.