నిజామాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

 నిజామాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

పంచాయతీ కార్మికుల ధర్నా

ధర్పల్లి, వెలుగు : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ గురువారం ధర్పల్లి ఎంపీడీఓ కార్యాలయం  ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా టీయూసీఐ సహాయ కార్యదర్శి రమేశ్​ మాట్లాడుతూ అర్ధరాత్రి కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగవన్నారు.

పంచాయతీ కార్మికుల సమస్యలను రేవంత్​రెడ్డి సర్కార్​పరిష్కరించాలని లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు ఆశన్న, నాయకులు సాయిలు, విలాస్​, గంగాధర్, కృష్ణ, రాములు, సునీత, రాజవ్వ పాల్గొన్నారు.  

పాఠశాల తనిఖీ 

లింగంపేట, వెలుగు : లింగంపేట మండలం శెట్పల్లి జడ్పీ హైస్కూల్​ను గురువారం ఎంపీడీఓ నరేశ్​ తనిఖీ చేశారు. పాఠాలు ఎలా బోధిస్తున్నారని  స్టూడెంట్లను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.  టెన్త్​లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా స్టూడెంట్లను ప్రోత్సహించాలని హెచ్​ఎం వసుధకు సూచించారు. అనంతరం అయ్యపల్లి గ్రామంలోని అంగన్​వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.  మెంగారంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును పరిశీలించారు.

కుంట కబ్జాతో సంబంధంలేదు

ధర్పల్లి, వెలుగు : ధర్పల్లి మండల కేంద్రంలోని దమ్మన్నపేట రోడ్డులో షాదీఖానా వద్ద గల 1317 సర్వె నెంబర్లోని భూమికి తమకు సంబంధంలేదని కాంగ్రెస్​ నాయకులు అన్నారు. ధర్పల్లి సొసైటీలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.  కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాల్​రాజ్​ మాట్లాడుతూ..  కుంట కబ్జాతో తమకు సంబంధంలేదని, ఆ భూమి గంగపుత్రులకు సంబంధించిన పట్టాభూమన్నారు. తమకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు.  

దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన సవాల్​ చేశారు. కుంట కబ్జాపై రూరల్​ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఫిర్యాదు చేశామన్నారు. తహసీల్దార్​తో మాట్లాడి ఎమ్మెల్యే విచారణకు ఆదేశించారని, వాస్తవాలు బయటపడుతాయని తెలిపారు. కార్యక్రమంలో సింగిల్​విండో అధ్యక్షుడు చిన్నారెడ్డి, చెలిమెల శ్రీనివాస్, బొక్కల బాలయ్య, దినకర్, రాకేశ్ పాల్గొన్నారు.  

వ్యక్తి ఆత్మహత్య

భిక్కనూరు, వెలుగు : కడుపు నొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని జంగంపల్లిలో జరిగింది.  ఎస్ఐ సాయికుమార్,​ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బందెల శివరాజ్​(45) కొన్ని నెలలుగా  కడుపు నొప్పితో బాధపడుతున్నాడు.  చికిత్స చేయించుకున్నా తగ్గకపోవడంతో గురువారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నారు. 

చిరుత  సంచారంతో ప్రజల ఆందోళన

లింగంపేట, వెలుగు : లింగంపేట మండల సరిహద్దు గ్రామమైన కంచ్​మల్​అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండడంతో  కంచ్​మల్, కొండాపూర్, ముంబాజిపేట, కొండాపూర్​తండాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి కంచ్​మల్–​- సీతాయిపల్లి గ్రామాల మధ్యగల రహదారిపై  వాహనదారులకు  చిరుతపులి కనిపించింది. దీంతో సమీప గ్రామాల  ప్రజలు భయాందోళన చెందుతున్నారు.  చిరుతను బంధించేందుకు ఫారెస్టు ఆఫీసర్లు  చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

పారిశుద్ధ్య పనులు కొనసాగాలి

కామారెడ్డి​టౌన్, వెలుగు : మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​ అన్నారు.  గురువారం  కలెక్టరేట్లో అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  టౌన్లలో  రోడ్లు క్లీన్​గా ఉండాలన్నారు.  ప్రతీ ఇంటి నుంచి చెత్త సేకరణ వంద శాతం జరగాలన్నారు.  

క్యాండిల్ ర్యాలీ

నిజామాబాద్ సిటీ, వెలుగు : సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం విద్యా వనరుల కేంద్రంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ హైమావతి మృతికి  సంతాపంగా గురువారం ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో ఉన్న హైమవతి  తీవ్ర ఒత్తిడికిలోనై గుండెపోటుతో బుధవారం మరణించినట్లు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రాజు తెలిపారు.  హైమావతి కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.