అన్ని అర్హతలున్నయ్​..జేపీఎస్​లుగా గుర్తించండి.. పంచాయతీ సెక్రటరీల డిమాండ్​

కరీంనగర్, వెలుగు: ఇటీవల జూనియర్ పంచాయతీ సెక్రటరీ(జేపీఎస్​)ల రెగ్యులరైజేషన్ ప్రక్రియను మొదలు పెట్టిన ప్రభుత్వం.. వారిలాగే  పంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్న ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీ(ఓపీఎస్)ల భవితవ్యం ఏమిటో తేల్చలేదు.  గతంలో పంచాయతీ సెక్రటరీలు చేపట్టిన సమ్మెలో  ఓపీఎస్ లను జేపీఎస్ లుగా కన్వర్ట్ చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ..  ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో పని చేస్తున్న 1,074 మంది ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలు ఆందోళన చెందుతున్నారు.  జేపీఎస్​ల్లాగే తాము ఎగ్జామ్ రాశామని,  వారు ఖాళీ అయిన స్థానాల్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ ద్వారా తాము ఓపీఎస్​లుగా ఉద్యోగంలో చేరామని, అన్ని అర్హతలు ఉన్న తమను కనీసం జేపీఎస్ లుగానైనా గుర్తించాలని కోరుతున్నారు. 

ఆర్డర్ ఆఫ్ మెరిట్​లోనే ఉద్యోగంలోకి.. 

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న  9,355 జూనియర్ పంచాయతీ సెక్రటరీ  పోస్టుల భర్తీకి 2018లో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష నిర్వహించి 2019 ఏప్రిల్, మే నెలల్లో భర్తీ చేసింది.  అయితే  అప్పుడు జాయిన్ అయిన వారిలో కొందరు పని ఒత్తిడి, ఇతర కారణాలతో  రిజైన్ చేసి వెళ్లిపోయారు. అలాగే రెండేండ్ల కింద సీనియర్ పంచాయతీ సెక్రటరీల్లో కొందరికి ప్రమోషన్ రావడంతో  ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఆ పోస్టులను ఔట్ సోర్సిగ్ పద్ధతిలో భర్తీ చేశారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఇలా రాష్ట్రవ్యాప్తంగా 1,074 మంది పని చేస్తున్నారు.  వీరిలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 82 మంది పని చేస్తుండగా, రంగారెడ్డి జిల్లాలో 73 మంది, కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో 63 మంది,  నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లో 52 మంది చొప్పున, కామారెడ్డి జిల్లాలో 51 మంది ఓపీఎస్ లు డ్యూటీ చేస్తున్నారు. 

ఓపీఎస్ లతో వెట్టి చాకిరీ..

రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలకు ప్రభుత్వం నెలకు రూ.15 వేల జీతం చెల్లిస్తోంది. జేపీఎస్ లతో పోలిస్తే  ఈ వేతనం సగమే.  గ్రామాల్లో  ఉదయం నుంచి సాయంత్రం వరకు పారిశుధ్యం,  స్ట్రీట్ లైట్స్, మంచినీటి సరఫరా, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె  ప్రకృతి వనాలు, తెలంగాణకు హరితహారం, ఇంటి పన్నుల వసూలు, బర్త్, డెత్, గ్రామసభ తదితర రికార్డుల నిర్వహణ,  పల్లె ప్రగతిలాంటి అనేక పనులను జేపీఎస్ లు, సీనియర్ పంచాయతీ సెక్రటరీలతో సమానంగా నిర్వహిస్తున్నారు. ఇంత చాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం.. వీరికి కేవలం రూ.15 వేలు మాత్రమే చెల్లిస్తోంది. 

అమలుకాని జీవో 60.. 

రాష్ట్ర ప్రభుత్వం 2021  జూన్ 11న విడుదల చేసిన జీవో నంబర్ 60 ప్రకారం.. అన్ని శాఖల్లోని కాంట్రాక్ట్,  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం శాలరీ పెరిగింది. దీంతో అన్ని శాఖల్లో శాలరీ పెంచి ఇస్తున్నా,  ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలకు మాత్రం ఇవ్వడం లేదు. పెరిగిన జీతం ప్రకారం ఓపీఎస్ లకు రూ.19,500  అదే ఏడాది జులై నుంచే చెల్లించాల్సి ఉంది. జీవో ఇచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు శాలరీ పెంచకపోవడంతో సర్కార్ తీరుపై  వారు మండిపడ్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలతో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు గ్రామాల్లో డ్యూటీ చేస్తున్నామని, అయినా రోజువారీ వేతనం రూ.500 కూడా పడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.