
నాగపట్టణం:పెండ్లి చేసుకున్న వెంటనే యువత పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. రాష్ట్రానికి అధికంగా ఎంపీ స్థానాలు కావాలంటే ఎక్కువ జనాభా అనేది ప్రామాణికంగా కనిపిస్తున్నదని తెలిపారు. సోమవారం నాగపట్టణంలో జరిగిన ఓపెండ్లి వేడుకకు స్టాలిన్ హాజరై మాట్లాడారు.
‘‘పెండ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనొద్దని కొన్నేండ్ల క్రితం నేను చెప్పా. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. అందువల్ల అటువంటి సలహాను ఇవ్వను. అధిక జనాభా ఉంటేనే రాష్ట్రానికి ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తాయి. ఎందుకంటే డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. జనాభాను నియంత్రించడంపై తమిళనాడు శ్రద్ధ చూపి విజయం సాధించింది. నేటి రాష్ట్ర దుస్థితికి అదే కారణం. పెండ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనండి. వారికి అందమైన తమిళ పేర్లు పెట్టండి.
డీలిమిటేషన్ అనేది తమిళనాడు హక్కులు, ప్రయోజనాలకు సంబంధించినది. అందువల్ల ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దు”అని రాష్ట్ర ప్రజలకు స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా త్రి భాషా సూత్రాన్ని అమలు చేయాలని చూస్తోందని స్టాలిన్ ఆరోపించారు. అదే విధంగా డీలిమిటేషన్ రూపంలో తమిళనాడుకు ఎంపీ స్థానాలను తగ్గించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు.
ఉత్తరాదిలో మూడో భాషగా ఏం బోధిస్తున్నరు..?
దక్షిణాది రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఉత్తరాదిలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తే ఏ భాష నేర్పిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’ లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.
‘‘తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ కొంత మంది మమ్మల్ని అడుగుతున్నారు. కానీ, ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాషనను నేర్పిస్తున్నారో చెప్పడం లేదు. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం మూడు భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది?’’ అని ప్రశ్నించారు.