
దేశంలో మేలురకమైన టేకు కలప బ్రిటిష్ వారి పడవల తయారీకి అవసరం ఉండటంతో సహజ సిద్ధమైన అడవులను రక్షిత అడవులుగా ప్రకటిస్తూ 1927లో అటవీచట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం అడవులు ఆక్రమించడంగాని, అడవులు నరికి పోడు వ్యవసాయం చేయడంకాని చట్టరీత్యా విరుద్ధం. ఈ చట్టంతో అడవులలో నివసించే గిరిజనులకు ఇబ్బందిగా మారి పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది.
ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలోని గిరిజనుల తిరుగుబాటుకు గిరిజన నాయకుడు కుమరం భీమ్ సారథ్యం వహించాడు. అనంతరం పోలీసు కాల్పులలో కొమరం భీమ్ చనిపోవడం జరిగింది. 1940లో అంతవరకు అడవులను ఆక్రమించుకున్న 50 వేల ఎకరాల అటవీ భూములకు సంబంధించి గిరిజనులందరకు పట్టాలు ఇవ్వడం జరిగింది.
అయితే, అడవుల ఆక్రమణ అంతటితో ఆగక 1970 వరకు సుమారు 2.5 లక్షల ఎకరాల అడవుల ఆక్రమణలకు గురికాగా అప్పటి ప్రభుత్వం సమస్యకు పరిష్కారంగా గత 30 సంవత్సరాల్లో ఆక్రమణకు గురైన 2.5 లక్షల ఎకరాల అటవీ భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈవిధంగా రెండుసార్లు అటవీభూముల ఆక్రమణలకు పట్టాలు చేయడంతో పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో చొరబడి అడవులను ఆక్రమించడం మొదలైంది. ఈ సమస్య చాలా రాష్ట్రాలలో మొదలవడంతో భారత పార్లమెంటు 2006లో అటవీ హక్కుల చట్టం పేరుతో ఒక చట్టం తెచ్చింది.
అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 సంవత్సరం వరకు అడవులు ఆక్రమించి వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు సమగ్ర విచారణ జరిపి పట్టాలు ఇవ్వాలని నిర్దేశించింది. ఇందుకోసం సంబంధిత అధికారులు గ్రామాలలోకి వెళ్ళి గ్రామసభ ఏర్పాటు చేసి గిరిజనుల నుంచి 2005వ సంవత్సరం కంటే ముందు తాము అడవులను ఆక్రమించుకున్నట్టు సరియైన ఆధారాలు చూపించినవారికి పట్టాలు ఇవ్వాలని నిర్దేశించింది. దీని ప్రకారం గ్రామసభలు జరిపి తగిన ఆధారాలు చూపించిన సుమారు ఒక లక్ష గిరిజన కుటుంబాలకు 3 లక్షల ఎకరాల అడవి భూములు మూడోసారి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈవిధంగా పెద్ద ఎత్తున అడవిభూములు ఆక్రమణకు గురవడంతో పర్యావరణానికి, వన్య ప్రాణులకు హాని కలుగుతుందని ‘వైల్డ్ లైఫ్ ఫస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో అటవీహక్కుల చట్టంపై పిటీషన్ నంబరు 109/ 2008 వేయడం జరిగింది.
ఈ మధ్యలో చాలా రాష్ట్రాలలో కొత్తగా నరికిన అడవులు (అంటే 2005 తరువాత) ఆక్రమించినవారి దరఖాస్తులు తిరస్కరించినా.. వారిని ఆక్రమిత అడవి భూముల నుంచి బయటకి పంపలేదు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాగా కోర్టువారు 13 ఫిబ్రవరి 2019 నాడు తమ తీర్పు వెలువరిస్తూ 2005 తరువాత ఆక్రమణలు చేసినవారిని తక్షణమే ఖాళీ చేయించాలని అండర్ పాస్ చేసినారు. దీనిపై చాలా రాష్ట్రాలు తమ ఇబ్బందులు తెలుపగా తమ ఆర్డరుపై స్టే ఇవ్వడం జరిగింది. కేసు కోర్టులోనే ఉంది.
గత పదేండ్లలో అడవుల ఆక్రమణను అడ్డుకున్నామా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పెద్ద ఎత్తున అడవులు నరకడం మొదలైంది. అడ్డుకున్న అటవీ అధికారులపై దౌర్జన్యం, చివరకు గొడ్డళ్లతో నరకడం వరకు వెళ్ళింది. ఈవిధంగా సుమారు 12 లక్షల ఎకరాల అడవి ఆక్రమించడం జరిగింది. 2021లో తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆదరబాదరాగా కేంద్రం ఇచ్చిన మార్గ దర్శకాలను తుంగలో తొక్కి రూల్సు మొత్తం మార్చి, 12 లక్షల ఎకరాలు సహజసిద్ధమైన (నేచురల్) అడవికి కొత్తగా పట్టాలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈవిధంగా పెద్ద ఎత్తున అడవుల ఆక్రమణ వాటి పట్టాలు పర్యావరణానికి, వన్య ప్రాణులకు హానికరమని స్టే ఇవ్వమని కోర్టును ఆశ్రయించగా, కోర్టువారు స్టే ఇవ్వలేదు. (పిల్ నం. 7/2023) రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి వివరాలు తెలుపుతూ 12 లక్షల ఎకరాల అటవీభూమి ఆక్రమణకు గురైందని అందులో పోడు వ్యవసాయం చేస్తున్నవారికి పట్టాలు ఇస్తామని తెలిపారు. ఈవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అడవులు నరకడంతో వన్యప్రాణులు ఆవాసాలు లేకపోవడం వల్ల చాలా మటుకు అవి తగ్గిపోవడం జరుగుతోంది. తరచుగా పెద్ద పులులు, చిరుతలు గ్రామాలలోనికి రావడం, కోతులు, పందులు పంట నష్టం చేయడం, అడవులు నరకడంతో నేల కోతకు గురై మట్టి నదులలో ప్రాజెక్టులలో మేట వేయడం జరుగుతోంది.
ఆక్రమణకు గురైన అటవీ భూముల సంగతి?
2008వ సంవత్సరంలో ‘వైల్డ్ లైఫ్ ఫస్ట్’ అనే సంస్థ అటవీ హక్కుల చట్టంపై వేసిన పిటిషన్ ఇప్పటివరకు సుప్రీంకోర్టులోనే పెండింగులో ఉంది. అలాగే 2023లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు పెద్ద ఎత్తున అటవీ భూములకు పట్టాలు ఇవ్వవద్దని దాఖలు చేసిన పిల్ కూడా రాష్ట్ర హైకోర్టులో పెండింగులో ఉంది. అటవీహక్కుల పుణ్యమా అని రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల అడవి భూములు ఆక్రమణలకు గురైనాయి. ఇంకా ప్రతిరోజూ ఏదో ఒక మారుమూల ప్రాంతంలో అడవులు నరుకుతున్నారు. ఇక దేశం మొత్తం మీద లెక్క తీస్తే అటవీ హక్కుల చట్టం వచ్చిన తరువాత చాలా పెద్ద మొత్తంలో అడవులు ఆక్రమణకు గురయ్యాయి. ఇదిలా ఉండగా.. ఈ మధ్య హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూమిలో ఒక వంద ఎకరాల అడవిలో చెట్లు నరికారని అది కాస్తా సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, కోర్టువారు దీనిని తీవ్రంగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, ఇతర ఉన్నత అధికారులను.. 100 ఎకరాల అడవులను ధ్వంసం చేసి, పర్యావరణానికి, వన్య ప్రాణులకు హాని కలిగించినందుకు పర్యావరణ పునరుద్ధరణ చేయాలని, లేనిచో వారందరిని జైలులో పెడతామని ఘాటు వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం.
రాజకీయ నాయకులను ఎందరిని జైళ్లలో పెట్టాలి?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కాళేశ్వరం ప్రాజెక్టు వాటి కాలువలకు సుమారు 8 వేల ఎకరాల అటవీ భూమిని తీసుకున్నారు. ఇక గిరిజనాభివృద్ధి శాఖ వారు చాలామంది గిరిజనేతరులకు తప్పుడు ధృవపత్రాలు ఇచ్చి పోడు వ్యవసాయాన్ని ప్రొత్సహించారు. చివరగా అప్పటి పాలకులు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 12 లక్షల ఎకరాల మంచి వృక్ష సంపద, వన్యప్రాణులు గల అడవి భూములను పట్టాలుగా చేయడం చూస్తే.. సుప్రీంకోర్టు చెప్పినట్లు ఎందరు రాజకీయ నాయకులను, ఎందరు అధికారులను జైళ్లల్లో పెట్టాలి ? అందుకు ఎన్ని కొత్త జైళ్ళు కట్టాలి? విదేశాల నుంచి చాలా స్వచ్ఛంద సేవాసంస్థలు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో ఏనుగులు, లేళ్ళు, దుప్పులు, నెమళ్ళు ఉన్న అడవులను ధ్వంసం చేస్తున్నారట నిజమేనా అని వాకబు చేస్తున్నారు. దేశ ప్రధాని మోదీ కూడా తెలంగాణలో అడవుల విధ్వంసం జరుగుతోంది అనడం కూడా విచారకరం. కొన్ని రాజకీయ పార్టీలు అధికార పార్టీని బద్నాం చేయడానికి కృత్రిమ మేధ ఫొటోలు, వీడియోలు, ఫేక్ పోస్టులతో చేసిన ప్రచారంతో దేశ విదేశాలలో తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాదు నగరానికి చెడ్డపేరు తెచ్చారు.
యం. పద్మనాభరెడ్డి,
అధ్యక్షుడు,
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్