ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకి చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య కేసులో ఎనిమిది మందిని ఖానాపురం హవేలీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గ్రామానికి చెందిన పది మంది తన వ్యవసాయ భూమిలోని మట్టిని తరలించి నష్టం కలిగించారంటూ రైతు ప్రభాకర్ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
సూసైడ్‌కు ముందు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సంచలనంగా మారింది. మృతుడి తండ్రి పెద్ద వీరయ్య ఫిర్యాదుతో గ్రామానికి చెందిన పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా మండలానికి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి భర్తను కూడా పోలీసులు ఎంక్వైరీ చేసినట్లు తెలిసింది.