- బెడ్రూం సహా లగ్జరీ హోటల్ ను తలపించేలా సౌలతులు
- 2026 కల్లా స్పేస్ టూర్ లు అందుబాటులోకి..
- అమెరికాలోని ‘వ్యాస్ట్’ ఏరోస్పేస్ కంపెనీ నిర్మాణం
వాషింగ్టన్: ఆస్ట్రోనాట్లే కాకుండా సాధారణ ప్రజలను కూడా అంతరిక్ష యాత్రలకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే స్పేస్ఎక్స్ వంటి కంపెనీలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే, ఇప్పటివరకూ కొన్ని గంటల టూర్ల మీద మాత్రమే ఆయా కంపెనీలు దృష్టి పెట్టగా.. అమెరికాకు చెందిన ‘వ్యాస్ట్’ ఏరోస్పేస్ కంపెనీ మాత్రం ఏకంగా 30 రోజుల స్పేస్ టూర్‌ను ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) వీడియోలు, ఫొటోలు చూస్తే.. అందులో వైర్లు, డివైస్ లతో నిండిపోయిన ఇరుకైన స్టోర్ రూంల మాదిరిగా చాంబర్లు కనిపిస్తుంటాయి.
కానీ వ్యాస్ట్ కంపెనీ మాత్రం అంతరిక్షంలో లగ్జరీ హోటల్ ను తలపించేలా ‘హావెన్–1’ పేరుతో పక్కా కమర్షియల్ స్పేస్ స్టేషన్ ను డిజైన్ చేసింది. ఇందులో ఒక్కో టూర్ లో నలుగురికి మాత్రమే చోటు ఉంటుంది. అయితే, అందమైన ఇంటీరియర్ తో విశాలమైన హాల్స్, సౌకర్యంగా ఉండే బెడ్ లతో సెపరేట్ బెడ్రూంలు, స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఉంటాయట. స్పేస్ లో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో 30 రోజులు ఉంటే గుండె ఆరోగ్యం, ఎముకల పటుత్వం దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి.. ఆ సమస్యలను అధిగమించేందుకు చక్కటి జిమ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆ కంపెనీ చెప్తోంది. అలాగే ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా నిరంతరం వైఫై అందిస్తామని, భూమిపై ఉన్న ఆప్తులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో కాల్స్ చేసుకోవచ్చని అంటోంది.
ఎవరైనా స్పేస్ లో వింత వింత ప్రయోగాలు చేయాలనుకుంటే అందుకు కూడా తాము ఏర్పాట్లు చేస్తామని ఆ కంపెనీ వెల్లడించింది. ఈ స్పేస్ స్టేషన్ ను 2025 ఆగస్టులో లాంచ్ చేస్తామని, 2026కల్లా తొలి కమర్షియల్ టూర్ ను ప్రారంభిస్తామని తెలిపింది. అయితే, ఈ నెల రోజుల స్పేస్ టూర్ కు చార్జీలు ఎంత డిసైడ్ చేశారన్నది మాత్రం ఇంకా వెల్లడికాలేదు.