కామారెడ్డి జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం .. కూలిన చెట్లు, ఇంటి పైకప్పులు

కామారెడ్డి జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం .. కూలిన చెట్లు, ఇంటి పైకప్పులు
  • పిడుగు పాటుకు 40 గొర్రెలు మృతి
  • తడిసిన వడ్లు, నిలిచిన విద్యుత్​ సరఫరా

కామారెడ్డి/కామారెడ్డిటౌన్​, వెలుగు: కామారెడ్డి జిల్లాలో శుక్రవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల అకాల వర్షం  కురిసింది. కామారెడ్డి, రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, బీబీపేట మండలాల్లో అకాల వర్షంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. జిల్లాలోని చాలా మండలాల్లో బలమైన ఈదురుగాలులు వీచాయి. కామారెడ్డి మండలం ఇస్రోజివాడి శివారులో వర్షంతో పాటు పిడుగు పడింది. కడారి దేవయ్య గొర్రెలను మోపేందుకు గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. గొర్రెలు మేసి చెట్ల కింద సేద తీరుకున్న సమయంలో పిడుగు పడడంతో 4‌‌0 గొర్రెలు చనిపోయాయి. కామారెడ్డి మండలం గూడెంలో వర్షంతో పాటు ఈదురుగాలులతో నష్టం వాటిల్లింది. బలమైన గాలులు వీయడంతో ఇండ్లు, గుడిసెలపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. కరెంట్​ పోల్స్​ విరిగిపడ్డాయి. 

పలు చోట్ల చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బీబీపేట మండలంలో బలమైన గాలులకు రేకులు కొట్టుకుపోయాయి. పాల్వంచ, మాచారెడ్డి మండలాల్లోని ఆరేపల్లి, చుక్కాపూర్​, మాచారెడ్డి తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. చుక్కాపూర్​లో ఆరబోసిన వడ్ల కుప్పలు తడిసిపోయాయి.  కామారెడ్డిలో బలమైన గాలులు వీయడంతో ఎన్జీవోస్​ కాలనీ, డిగ్రీ కాలేజీ సమీపంలో చెట్లు పడిపోయాయి. పట్టణంతో పాటు పలు మండలాల్లో గంటల తరబడి కరంట్​ సప్లై నిలిచిపోయింది.  అధికారులు పడిపోయిన చెట్లను తొలగించి, కరెంట్​ సరఫరాను పునరుద్ధరించారు.