గ్రేటర్ ఎన్నికల్లో హవాలా వ్యాపారం జోరు..

గ్రేటర్ ఎన్నికల్లో హవాలా వ్యాపారం జోరు..

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగుఎన్నికలంటేనే పైసల ఎవ్వారం. డబ్బుంటేనే ప్రతి పని ముందుకు కదుల్తది. ప్రచారం మొదలుకొని.. ప్రలోభాల పర్వం దాకా ప్రతిచోటా పైసలుండాల్సిందే. లేకుంటే ఎన్నికలు గెల్సుడు అంత సులభం కాదు. ఎలక్షన్​ కమిషన్​ రూల్స్​తో ఎక్కువ డబ్బులు పట్టుకపోవడం అంత ఈజీ కాదు. ఒక కేండిడేట్​ రూ.ఐదు లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదు. అందుకే చాలా మంది హవాలా మార్గాన్ని ఆశ్రయిస్తున్నరు. ఎన్నికలతో గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో హవాలా వ్యాపారం జోరుగా సాగుతోంది.

రూ.కోట్ల తరలింపు..

ఒక చోటు నుంచి మరో చోటుకు లెక్కాపత్రం లేకుండా కమీషన్​ తీసుకుని డబ్బు తరలించే విధానమే హవాలా. బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.వందల కోట్ల వ్యాపారం సాగుతుంది. కొంత మంది నమ్మకస్తుల నుంచి పరిచయం ఉన్న వారి ద్వారా డబ్బును రవాణా చేస్తుంటారు. ఎక్కడా రాతపూర్వక హామీ, గ్యారెంటీ అనే పదం వాడరు.

మెసేజ్‌‌‌‌‌‌‌‌లు, కోడ్‌‌‌‌‌‌‌‌, వాట్సాప్‌‌‌‌‌‌‌‌ ద్వారా..

హవాలా ద్వారా డబ్బులు తరలించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెసేజ్‌‌‌‌‌‌‌‌లు, కోడ్‌‌‌‌‌‌‌‌, వాట్సాప్‌‌‌‌‌‌‌‌ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో కూడా రవాణా చేస్తున్నారు. యాక్టివ్‌‌‌‌‌‌‌‌ పర్సన్స్‌‌‌‌‌‌‌‌, సిటీలో అన్ని ప్రాంతాలు తెలిసిన వారినే ఈ పనికి వాడుకుంటున్నారు. సాధారణంగా సాయంత్రం, రాత్రి సమయాల్లో పోలీసులు తనిఖీలు చేస్తారు. ఆ సమయాల్లో కాకుండా తెల్లవారు జామున, మిట్ట మధ్యాహ్నం, పోలీసులు బందోబస్తు విధుల్లో బిజీగా ఉన్నప్పుడు డబ్బును తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమానం రాకుండా సబ్బుల కార్టన్‌‌‌‌‌‌‌‌లలో లేదా బట్టల మాదిరిగా ప్యాక్‌‌‌‌‌‌‌‌ చేసి వెహికల్స్​ డిక్కీలో తీసుకెళ్తున్నట్టు చెబుతున్నారు. సాధారణ సంచుల్లో తీసుకెళితే ఎవరికీ అనుమానం రాదని, నడుచుకుంటూ వెళితే ఎవరూ దృష్టి పెట్టరని మరికొంతమంది అలా కూడా డబ్బును తీసుకెళుతున్నట్లు సమాచారం.

హవాలాకే డిమాండ్‌‌‌‌‌‌‌‌..

కార్పొరేటర్ ​కేండిడేట్లకు ఖర్చుకు పరిమితులు పెట్టిన నేపథ్యంలో.. ఎక్కువ  డబ్బును తరలించలేకపోతున్నారు. కొన్నిచోట్ల  కొందరు నాయకులకు పోలీసులే కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అయినా హవాలా ద్వారానే సొమ్ము తరలించడం మంచిదని లీడర్లు భావిస్తున్నారు. బినామీల పేర్లతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన  కొందరు అక్కడ్నుంచి కూడా డబ్బు తెప్పిస్తున్నట్లు సమాచారం. దీంతో హవాలా వ్యాపారానికి డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరిగింది. 0.8 శాతం నుంచి రెండు శాతం వరకు కమీషన్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నారని  తెలుస్తోంది. విదేశాల నుంచి అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటారని, ఒక్కోసారి దేశం, మొత్తాన్ని బట్టి 5శాతం కూడా కమీషన్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటారని తెలిసింది. అయితే డబ్బును కొంత కాలం నిల్వ ఉంచుకోవాలంటే దానికి మరో రేటు కడుతున్నారు.