డ్రగ్స్ దందాలో హవాలా! అమెరికా నుంచి 15 మంది యువతుల ఖాతాల్లోకి నగదు బదిలీ

డ్రగ్స్ దందాలో  హవాలా!  అమెరికా నుంచి 15 మంది యువతుల ఖాతాల్లోకి నగదు బదిలీ
  • వాటిని నైజీరియాకు హవాలా మార్గాల ద్వారా తరలింపు
  • పార్సిల్ ద్వారా డ్రగ్స్ సరఫరార చేస్తున్న పెడ్లర్లు
  • ఐదేండ్లలో చేతులు మారిన కోట్ల రూపాయలు
  •  మనీల్యాండరింగ్ గట్టు రట్టు చేసిన టీజీ న్యాబ్ విభాగం


హైదరాబాద్: డ్రగ్స్ దందాలో హవాలా కోణం వెలుగు చూసింది. అమెరికాలో డ్రగ్స్ కావాలనుకునే వారు హైదరాబాద్ లోని 15 మంది అమెరికా యువతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. నైజీరియన్లు వారికి వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్ పంపుతున్నారు. ఇక్కడి యువతుల అకౌంట్లలో జమ అయిన మొత్తాన్ని డ్రగ్స్ పెడ్లర్లు హవాలా మార్గాల ద్వారా నైజీరియాకు తరలించుకుపోతున్నారు. టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన ఓ మహిళను అరెస్టు చేయగా అసలు విషయం బయటపడింది. ఆమె బ్యాంకు లావాదేవీలపై అనుమానం వచ్చి మూడు నెలల పాటు నిఘా వేశామని టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నైజీరియన్లను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు.

మరో 9 మంది కోసం గాలిస్తున్నారు. నిందితులు డార్క్‌ వెబ్‌, ఫారెక్స్‌ మనీ ఏజెంట్ల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారి నుంచి రూ.12.50 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. భారత్‌తో పాటు అమెరికాలోనూ వీరు డ్రగ్స్‌ను విక్రయించారు. డ్రగ్ పెడ్లర్స్ అమెరికా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నగదును భారత్‌కు బదిలీ చేస్తున్నారు. ఇండియాతో పాటు అమెరికాలో నైజీరియన్ లు  డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఐదేండ్లలో అమెరికా– ఇండియా– నైజీరియా మధ్య కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి.

ఎస్కటసీ, ఎండీఎంఏ యూరప్ లోనే తయారవుతుంది. నెదర్లాండ్, బెల్జియం నుంచి ఎక్కువగా డ్రగ్స్ భారత్ కు వస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు నుంచి అమెరికా సహా ఇతర దేశాలకు డ్రగ్స్ రవాణా అవుతున్నాయి. ఆరు నెలల్లో పది పార్సిల్స్ ఈ ముఠా విదేశాలకు పంపినట్లు టీజీ న్యాబ్ గుర్తించిందని డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు.