- ఏర్పాట్ల కోసం రూ.15 లక్షలు కేటాయింపు
- ఇప్పటికీ ఎలాంటి సౌలత్లు కల్పించని అధికారులు
- కొరవడుతున్న పర్యవేక్షణ
వర్ని, వెలుగు: ఈ నెల 22 నుంచి హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుస్సేన్ బడాపహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉర్సు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. దీంతో ఈ ఏడాది కూడా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. వర్ని మండలం జలాల్‌పూర్ జీపీ పరిధిలో ఉన్న బడాపడాహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తారు.
ఇక్కడికి తెలంగాణతో పాటు ఆంధ్రా, కర్నాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తులకు కనీస వసతుల కల్పన కోసం ఏటా వక్ఫ్‌బోర్డు రూ.15 లక్షల నిధులు మంజూరు చేస్తుంది. వక్ఫ్బోర్డ్కమిటీ సభ్యులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై తూతూమంత్రంగా పనులు చేపట్టి, నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్సవాలకు ఏర్పాట్లు చేయకపోవడంతో దర్గా పరిసర ప్రాంతాలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. మురికి కాలువలు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
వసతులు కరవు..
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. తాగునీరు, మరుగుదొడ్లు, ఉండడానికి ధర్మశాలల లాంటి సౌకర్యాలు కల్పించలేదు. రెండు రోజుల పాటు అన్నదానం, ఫకీర్లకు ప్రత్యేక నివాసాలు, గదులకు సున్నాలు, రంగులు వేయడం, విద్యుత్త్ దీపాల అలంకరణ, దర్గాపైకి వెళ్లేందుకు మెట్ల దారిని అందంగా తీర్చిదిద్దాల్సి ఉంది. సోమవారం నుంచే ఉర్సు ఉత్సవాలు ప్రారంభం కానుండగా, ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేపట్టలేదు.
లెక్కా పత్రం లేదు..
వక్ఫ్ బోర్డు ద్వారా కేటాయించిన నిధులకు సంబంధించి మండల రెవెన్యూ, వక్ఫ్ బోర్డు కమిటీ ఆధ్వర్యంలో లెక్కలు చూపాల్సి ఉంటుంది. కానీ నేటి వరకు ఆ నిధులకు సంబంధించిన లెక్కలు లేవు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో భక్తులకు కనీస వసతులు కరువవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి దర్గా వద్ద దోపిడి నివారించాలని భక్తులు కోరుతున్నారు.