ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు.. 4 నెలల్లో పరిహారం ఇవ్వాలి

  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు : వ్యవసాయంలో నష్టం వచ్చి.. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబ సభ్యులకు 4 నెలల్లోగా పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఒక్కో బాధిత కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయాలని, కానీ సర్కారు అలా చేయడంలేదంటూ నల్ల సూర్యప్రకాశ్, బీ కొండలరెడ్డి హైకోర్టులో పిల్​దాఖలు చేశారు. మంగళవారం ఆ పిల్​ను హైకోర్టు చీఫ్​జస్టిస్​ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జే అనిల్‌‌కుమార్‌‌తో కూడిన బెంచ్​ విచారించింది.

పిటిషనర్ల తరఫున అడ్వొకేట్​వసుధా నాగరాజ్‌‌ వాదిస్తూ.. రైతుల ఆత్మహత్యలపై పోలీసులు 100కు పైగా చార్జ్​ షీట్లను దాఖలు చేశారని, అయితే బాధిత కుటుంబసభ్యులకు ప్రభుత్వం రూ.6 లక్షల చొప్పున సాయం మాత్రం అందించలేన్నారు. జీవో ప్రకారం ప్రభుత్వం కమిటీని నియమించి.. ఆత్మహత్యలపై పరిశీలన చేయాల్సి ఉందని.. కానీ, ఈ ప్రక్రియ కూడా జరగలేదని చెప్పారు. ప్రభుత్వ అడ్వొకేట్​ టి.శ్రీకాంత్‌‌రెడ్డి ప్రతివాదన చేస్తూ.. అన్ని జిల్లాల్లోనూ కమిటీలు నియమించినట్లు చెప్పారు. ఆర్డీవో,  వ్యవసాయ శాఖ డైరెక్టర్, పోలీసు అధికారితో కూడిన కమిటీలు ఏర్పాటయ్యాయన్నారు.

ALSO READ : డేంజర్​లో అన్నారం బ్యారేజీ .. పునాదుల కింద కటాఫ్​ వాల్స్​కు గండి

ఆ కమిటీలు రైతుల ఆత్మహత్యలపై 28 ప్రతిపాదనలు చేశాయని వివరించారు. గడువు ఇస్తే కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనిపై కోర్టు స్పందించి.. ‘‘ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల నుంచి అందిన వినతిపత్రాలను ముగ్గురు సభ్యుల కమిటీ పరిశీలన చేయాలి. ఆ కమిటీ విచారణ చేపట్టి, అర్హులైన కుటుంబసభ్యులకు చట్ట ప్రకారం సాయం అందజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 2015లో జారీ చేసిన 173, 194 జీవోల ప్రకారం కమిటీని ఏర్పాటు చేయాలి. బాధిత కుటుంబసభ్యులకు 4 నెలల్లోగా ప్రభుత్వం సాయాన్ని అందజేయాలి”అని ఆదేశించి పిల్స్‌‌పై విచారణను మూసివేసింది.