- హైడ్రాకు హైకోర్టు అనుకూల తీర్పు
- త్వరలో చెరువు పునరుద్ధరణకు చర్యలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబర్‌పేట పరిధిలోని బతుకమ్మ కుంట స్థలం తమదేనంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరణకు హైడ్రా చేపట్టిన చర్యలు సక్రమమేనంటూ మంగళవారం తీర్పునిచ్చింది. చెరువుల పునరుద్ధరణలో భాగంగా గతేడాది నవంబరు 13న బతుకమ్మ కుంటను హైడ్రా చీఫ్రంగనాథ్ సందర్శించారు. అదేరోజు చెరువు పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు.
అయితే ఆ స్థలం తమదంటూ ఎడ్ల సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి నవంబర్14న హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హైడ్రా చర్యలపై కోర్టు స్టే ఇచ్చింది. హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు సర్వే నంబరు 563లోని భూ రికార్డులను పరిశీలించి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ కు బతుకమ్మ కుంటపై హక్కులేదని తీర్పు చెప్పారు బతుకమ్మకుంటపై 2017లో హైకోర్టు డ్యుయల్బెంచ్ చెరువుగానే తీర్పు చెప్పిందని, ఫిర్యాదుదారుడికి హక్కుంటే సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని సలహా ఇచ్చింది.
ఎర్రకుంటనే.. బతుకమ్మ కుంట..
1962–-63 లెక్కల ప్రకారం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉంది. బఫర్ జోన్‌తో కలిపి 16.13 ఎకరాలు ఉంది. తాజా సర్వే ప్రకారం అక్కడ 5.15 ఎకరాలు మాత్రమే మిగిలింది. దీన్ని పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు చేపట్టనుంది. అక్కడ ఉంటున్న వారికి సమస్య లేకుండా చెరువును పునరుద్ధరించనున్నారు. బ్యూటిఫికేషన్చేపట్టనున్నారు. ఒకప్పటి ఎర్రకుంటనే కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కాలక్రమంలో బతుకమ్మకుంటలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పోయడంతో చెరువు ఆనవాళ్లు లేకుండా పోయిందంటున్నారు.
కాగా, హైకోర్టు తీర్పు అనుకూలంగా రావడానికి కృషి చేసిన హైడ్రా లీగల్ టీమ్‌తో పాటు రెవెన్యూ ఉద్యోగులను మంగళవారం హైడ్రా హెడ్డాఫీసులో కమిషనర్ రంగనాథ్ సన్మానించారు. హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ కె. రవీందర్‌రెడ్డి, సీహెచ్.జయకృష్ణ, హైడ్రా న్యాయ సలహాదారుడు శ్రీనివాస్, హైడ్రా లీగల్ విభాగం లైజినింగ్ ఆఫీసర్ డి. మోహన్, హైడ్రా డిప్యూటీ కలెక్టర్ ఎల్.సుధ, తహసీల్దార్ ఎం.హేమ మాలిని, తహసీల్దార్ పి. విజయ్ కుమార్, అంబర్‌పేట తహసీల్దార్ బి. వీరాబాయి, సర్వేయర్ కిరణ్‌ను సత్కరించారు.