లోకల్ బాడీల్లో ఇద్దరు పిల్లల అంశంపై జోక్యం చేసుకోలేం : హైకోర్టు

లోకల్ బాడీల్లో ఇద్దరు పిల్లల అంశంపై జోక్యం చేసుకోలేం : హైకోర్టు
  • పిల్ దాఖలుపై హైకోర్టు అగ్రహం

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకున్న ఇద్దరు పిల్లల నిబంధనలపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ నిబంధనపై చట్టసభలు విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనలను సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రయోజనం ఏముందని, బాధిత వ్యక్తి నేరుగా ఆశ్రయించాలి కదా అని పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీరును తప్పుబడుతూ.. రూ.25 వేలు లీగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది.

 ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్న అభ్యర్థులు సర్పంచ్ / ఎంపీటీసీ / జెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీటీసీ ఎన్నికలలో పోటీ చేయడాన్ని నిషేధించే పంచాయతీ రాజ్ చట్టం-2018లోని సెక్షన్ 21(3)ని చట్టసభలు పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందంటూ నల్లగొండ జిల్లాకు చెందిన ఆవుల నాగరాజు హైకోర్టులో పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేశారు. ఈ చట్టాన్ని ఎత్తివేసేలా ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పలు అభ్యంతరాలతో ఈ పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిజిస్ట్రీ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయించలేదు. ఫైలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్, న్యాయమూర్తి రేణుకా యారా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ నిబంధనను సమర్థిస్తూ సుప్రీంకోర్టు 2003లో తీర్పు ఇచ్చిందని ధర్మాసనం గుర్తు చేసింది. 

పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... సుప్రీంకోర్టు 2003లో తీర్పు ఇచ్చిందని.. ఇప్పుడు 2025లో ఉన్నామని, తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు దృష్ట్యా ఇలాంటి నిబంధనలకు కాలం చెల్లిందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో ఇలాంటి నిబంధనలను ఎత్తివేస్తున్నట్టు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇందులో ప్రజాప్రయోజనం లేదని, వ్యక్తిగత ప్రయోజనం మాత్రమే ఉందని అభిప్రాయపడింది. 

ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్న అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడాన్ని నిషేధించే చట్టపరమైన అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని, పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అసెంబ్లీలు విధానపరమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. తీర్పు సందర్భంగా న్యాయవాది పదే పదే కలుగజేసుకోవడంపై అసహనం వ్యక్తం చేసింది. పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయడాన్ని తప్పుబడుతూ రూ. 25 వేలు రాష్ట్ర లీగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. చెల్లించని పక్షంలో పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.