
- ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలివ్వడం ఏంటని ప్రశ్నించిన హైకోర్టు
- కొంగరకలాన్ లోని 72 ఎకరాల భూ వివాదంపై విచారణ
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో 72 ఎకరాల అటవీ భూమిపై వివాదం కొనసాగుతున్నందున తుది ఉత్తర్వులు వెలువడే వరకు ఆ ల్యాండ్‌పై ఎలాంటి లావాదేవీలు నిర్వహించొద్దని రాష్ట్ర సర్కార్‌కు హైకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భూమిని అన్యాక్రాంతం చేయరాదని కూడా ఆదేశించింది. అటవీ భూమిని డీ నోటిఫై చేసి పట్టాలు మంజూరు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కలెక్టర్‌కు డీ నోటిఫై చేసే అధికారం ఉందా? అని ప్రశ్నించింది.
చట్టప్రకారం డీ నోటిఫై చేశారో.. లేదో చెప్పాలని కలెక్టర్‌తో పాటు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిషేధిత జాబితా నుంచి అటవీ భూమిని తొలగించి పట్టాలు జారీ చేయాలంటూ కలెక్టరేట్ నుంచి ఫైల్ వచ్చిందో.. లేదో.. కూడా చెప్పాలని జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కొంగరకలాన్ గ్రామంలో సర్వే నంబర్ 249లోని అటవీ భూమిలో 72 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని 2019, నవంబర్ 16న కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. కె.ప్రవీణ్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.