క్రికెట్‌లో రాణిస్తోన్న వర్ధమాన క్రికెటర్లకు హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(హెచ్‌సీఏ) శుభవార్త చెప్పింది. హెచ్‌సీఏ ఇంటర్నల్ క్రికెట్ సీజన్ 2023-24 కోసం అండర్ 14 స్థాయిలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేసిన వారికి ట్రయల్స్ నిర్వహించి.. మెరుగైన ప్రదర్శన చేసిన వారిని షార్ట్‌లిస్ట్ చేయనుంది. అనంతరం వారికి ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహించి అందులో బాగా రాణించిన వారిని 2024 జనవరిలో జరిగే సౌత్ జోన్ అండర్ 14 టోర్నమెంట్ కు ఎంపిక చేయనున్నారు.
ఈ ఓపెన్ ట్రయల్స్ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల వారికి డిసెంబర్ 22, 23 తేదీలలో, మిగిలిన జిల్లా వారికి డిసెంబర్ 24వ తేదీల్లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సెలక్షన్స్ జరగనున్నాయి. 01/09/2009 నుంచి 31/08/2011 మధ్య జన్మించిన క్రీడాకారులు మాత్రమే ఈ సెలక్షన్స్ కు అర్హులు.
ట్రయల్స్‌కు హాజరుకావాలనుకుంటున్న అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను వెంట బెట్టుకెళ్ళాలి. దరఖాస్తు ఫారమ్‌లు 19/12/2023వ తేదీ నుండి హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. క్రీడాకారులు ట్రయల్స్ కు హాజరయ్యే సమయంలో ఆధార్ కార్డ్ ఒరిజినల్‌తో పాటుగా పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకువెళ్లాలి. అలాగే, ఆటగాళ్ళు తెల్లటి దుస్తులు ధరించాలి. తమ సొంత కిట్ బ్యాగులు వెంటబెట్టుకెళ్లాలి. క్రీడాకారులు మరిన్ని పూర్తి వివరాల కోసం దిగువ ఇవ్వబడిన హెచ్‌సీఏ అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించగలరు.