
హైదరాబాద్, వెలుగు: రాబోయే ఐపీఎల్ సీజన్‌లో ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల టికెట్ల అమ్మకం, నియంత్రణ పూర్తిగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ బాధ్యత అని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. బీసీసీఐతో కలిసి హెచ్‌సీఏ ఐపీఎల్ ఏర్పాట్లను మాత్రమే పర్యవేక్షిస్తుందని టికెట్లను విక్రయించదని చెప్పారు.
ఉప్పల్‌లో ఈనెల 23, 27వ తేదీల్లో సన్ రైజర్స్ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు బ్లాక్ చేశారన్న ప్రచారాన్ని జగన్ ఖండించారు. తక్కువ ధర టికెట్లకు సహజంగానే భారీ డిమాండ్ ఉండటంతో త్వరగా అమ్ముడై ఉండవచ్చన్నారు. ఇతర ధరల టికెట్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఐపీఎల్ టికెట్లు బ్లాక్ చేస్తున్నదంటూ హెచ్‌సీఏపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.