ఈ మెయిల్స్ వద్దు.. కూర్చొని మాట్లాడుకుందాం: SRH ఆరోపణలపై స్పందించిన HCA

ఈ మెయిల్స్ వద్దు.. కూర్చొని మాట్లాడుకుందాం: SRH ఆరోపణలపై స్పందించిన HCA

హైదరాబాద్: టికెట్లు, కాంప్లిమెంటరీ పాసుల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‎సీఏ), సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‎హెచ్) ఫ్రాంచైజ్ మధ్య వివాదం నడుస్తోంది. టికెట్లు, పాసుల కోసం హెచ్‎సీఏ తమను వేధిస్తోందని ఎస్ఆర్‎హెచ్ సంచలన ఆరోపణలు చేసింది. ఇలాగైతే మేం హైదరాబాద్లో ఉండలేమని.. వేరే చోటుకు వెళ్లిపోతామని తెగేసి చెప్పింది. హెచ్‎సీఏ, ఎస్ఆర్‎హెచ్ ఇష్యూపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

హెచ్‎సీఏ టికెట్లు, పాసుల కోసం బెదిరింపులకు పాల్పడుతోందన్న ఎస్ఆర్‎హెచ్ ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఈ క్రమంలో ఎస్ఆర్‎హెచ్ ఆరోపణలపై హెచ్‎సీఏ స్పందించింది. ఎస్ఆర్‎హెచ్ ఆరోపణలకు మార్చి 29నే సమాధానం ఇచ్చామిచ్చామని.. హెచ్‌సీఏ ప‌రువుకు భంగం క‌లిగించేలా చేయ‌డం స‌బ‌బు కాదని పేర్కొంది. 

ALSO READ | SRH, హెచ్‎సీఏ మధ్య పాసుల లొల్లి: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. విజిలెన్స్ విచారణకు ఆదేశం

‘‘కోటాకు మించి ఎస్ఆర్ హెచ్‎ను అద‌న‌పు పాసులు హెచ్‌సీఏ ఎప్పుడు అడ‌గ‌లేదు.హెచ్‌సీఏ ప‌రువుకు భంగం క‌లిగించేలా చేయ‌డం మంచి ప‌ద్ధతి కాదు. ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వహించాల‌నే ఉద్దేశంతో కొన్ని స‌మ‌స్యలు ఉన్నా మేము మౌనంగా ఉంటున్నాం. హెచ్‌సీఏ కార్యవ‌ర్గ స‌భ్యుల ప‌ట్ల ఎస్ఆర్‌హెచ్ ఉద్యోగ బృందంలోని కొంద‌రు వ్యవ‌హ‌రించిన అమ‌ర్యాద‌పూర్వక‌మైన తీరు వ‌ల్లే ఈ స‌మ‌స్యలు. ఇప్పటికైనా ఈ-మొయిల్స్‌ పంపే విధానానికి స్వస్తి చెప్పి, ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టు యాజామాన్యం, సిబ్బంది హెచ్‌సీఏతో కూర్చొని మాట్లాడితే స‌మ‌స్యలు ప‌రిష్కరించ‌కోవ‌చ్చు. ఎస్ఆర్‌హెచ్‌తో చ‌ర్చలు జ‌రిపేందుకు హెచ్‌సీఏ కార్యవ‌ర్గం సిద్ధంగా ఉంది’’ అని తెలిపింది. 

హెచ్‌సీఏకు గ‌త రెండు మ్యాచ్‌ల‌కు ఎస్ఆర్‌హెచ్ ఇచ్చింది 3,880 కాంప్లిమెంట‌రీ పాసులేనని.. అవి కూడా మీరు హెచ్‌సీఏ కోసం ఇచ్చింది కోశాధికారి సీజే శ్రీనివాస్‌కు గానీ జ‌గ‌న్‌మోహ‌న్‌ రావుకు కాదని క్లారిటీ ఇచ్చింది. ఎఫ్‌-12 ఏ బాక్సులో సామ‌ర్థ్యానికి మించి మీరు 50 టిక్కెట్లు ఇస్తామంటే, మేము ఆ బాక్సులో 30 ఇచ్చి మిగిలిన 20 పాసులు మ‌రో బాక్సులో స‌ర్దుబాటు చేయ‌మ‌న్నాం. ఇందుకు ఎస్ఆర్‌హెచ్ ప్రతినిధులు కిర‌ణ్‌, శ‌ర‌వాణ‌న్‌, రోహిత్ సురేష్ అంగీక‌రించారు. హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్‌తో జ‌రిగిన ఈ భేటీలో అస‌లు పాల్గొన‌ని శ్రీనాథ్ ఆత‌ర్వాత ఈ విధ‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం బాధ‌క‌రమన్నారు. 

క్లబ్ సభ్యులకు 3900 టికెట్లు నేరుగా అందించాలనీ HCA కోరింది. SRH చివరికి 2500 టికెట్లు మాత్రమే ఇవ్వడానికి అంగీకరించింది. అలాగే.. HCA అధ్యక్షుడు వ్యక్తిగతంగా 3900 టికెట్లు ఇవ్వాలనే ఎక్కడా అడగలేదు. కేవలం క్లబ్ కార్యదర్శుల కోసం మాత్రమే టికెట్లు అడిగారు. టికెట్లు, పాసుల కోసం హెచ్‎సీఏ బ్లాక్ మెయిల్ చేస్తోందని ఎస్ఆర్ హెచ్‎చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. SRHలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. చిన్న విషయాలపై కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేసింది. 

CSR నిధుల ద్వారా స్టేడియం సదుపాయాలను మెరుగుపరిచేందుకు నిధులు ఇస్తామని SRH చెప్పింది. కానీ ఇప్పటికీ SRH ఖర్చు వివరాలు ఇవ్వలేదని ఆరోపించింది. SRH అధికారుల స్పందన లేకపోవడం వల్ల మాత్రమే F-3 బాక్స్ లాక్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. HCA అధ్యక్షుడిపై కావాలని తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని.. ఈ IPL సీజన్‎లో SRH, HCA సమావేశాల్లో అధ్యక్షుడు పాల్గొనబోరని పేర్కొన్నారు. ఇలా ఆరోపణలు చేయడం కంటే ప్రత్యక్షంగా సమావేశమై సమస్యలు పరిష్కరింకుందామని.. SRH అధికారులు త్వరగా సమావేశ తేదీని ఫిక్స్ చేయాలని సూచించింది.