హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జిల్లాల్లో పేద క్రికెటర్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మర్ క్యాంప్స్ నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాల్లో 30 రోజుల పాటు నిపుణులైన కోచింగ్ సిబ్బందితో ఉచితంగా క్రికెట్ కోచింగ్ ఇస్తామని ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు వెల్లడించారు.
ఇందుకోసం ఈ నెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని తెలిపారు. ‘వివాదం ఉన్న నల్లగొండ మినహా అన్ని ఉమ్మడి జిల్లాల్లో మూడేసి చోట్ల అండర్14, 16, 19, ఓపెన్ విభాగాల్లో బాయ్స్, గర్ల్స్‌కు సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. ఇందుకు జిల్లాకు రూ. 15 లక్షల ఫండ్స్ విడుదల చేశాం. క్యాంప్స్‌కు వచ్చే వారికి కిట్స్‌తో పాటు ఆహారం సైతం అందిస్తాం’ అని తెలిపారు. ఇక ఉప్పల్ స్టేడియం కరెంట్ బకాయిల్లో తొలి విడతగా రూ. 15 లక్షలు చెల్లించామన్నారు. ఐపీఎల్ తర్వాత స్టేడియం లోపల మరో విడత ఆధునీకరణ పనులు చేపడుతామని చెప్పారు. టాయిలెట్లు, కార్పొరేట్ బాక్స్ రూమ్‌లు, లిఫ్టులు, వీఐపీ లాంజ్‌లను తీర్చిదిద్దుతామని తెలిపారు.