ఒకటి తర్వాత రెండు ఉంటుంది.. 10 తర్వాత 11 వస్తుంది.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లెక్కలు మాత్రం వేరుగా ఉంటాయి.. ఒకటి తర్వాత రెండు కాదు.. మూడు వస్తుంది.. అదేంటీ చిత్రం అంటారా.. ఇలాగే జరిగింది ఇప్పుడు.. ఓ క్రికెట్ అభిమాని.. టికెట్ కొనుగోలు చేసి.. మ్యాచ్ చూడటానికి ఉప్పల్ స్టేడియంకు వెళ్లిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విశేషాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.. ఆ కథంటో చూద్దాం..
2024, ఏప్రిల్ 5వ తేదీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది కదా.. ఈ మ్యాచ్ కోసం జునైద్ అహ్మద్ అనే వ్యక్తి టికెట్ కొనుగోలు చేశాడు. టికెట్ పై జే66 (J 66) నెంబర్ సీటు కేటాయించారు. అయితే ఆ సీటు అస్సలు లేదు.. అవును.. J 66 తర్వాత J 67 నెంబర్ వేశారు స్టేడియం సిబ్బంది. J 66 నెంబర్ సీటు మాయం చేశారు. ముందూ వెనకా టికెట్లు కొనుగోలు చేసిన వారు.. వారి వారి సీట్లలో కూర్చున్నారు.. అహ్మద్ మాత్రం తన నెంబర్ తో ఉన్న సీటు లేకపోవటంతో.. మ్యాచ్ అంతా నిలబడే చూశాడు..
టికెట్ పై నెంబర్ ఉంది.. సీటు లేదు అంటూ స్టేడియం సిబ్బందికి చెబితే ఎవరూ పట్టించుకోలేదంట.. పోలీస్ సిబ్బంది సైతం ఏమీ చేయలేక చేతులెత్తేశారు.. టికెట్ ఉంది.. సీటు లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు అహ్మద్. తన టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. సీటు నెంబర్ లేకుండా టికెట్ పై నెంబర్ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నాడు.. ఏదిఏమైనా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అద్భుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. అంతేనా.. మొన్నటికి మొన్న కరెంట్ బిల్లు కట్టలేక కరెంట్ కూడా కట్ చేశారు స్టేడియంకు.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లెక్కకు ఓ తిక్క ఉంది అనటానికి ఇదే కదా నిదర్శనం...
ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇప్పటికే రెండు మ్యాచులు జరిగాయి. నిన్న జరిగింది రెండో మ్యాచ్.. మరి ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఇలాగే సీటు నెంబర్ మాయం అయ్యిందా లేక.. రెండో మ్యాచులోనే ఇలా జరిగింది అనేది క్వశ్చన్..