
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) విమెన్స్ టీమ్ హెడ్ కోచ్ విద్యుత్ జయసింహపై వేటు పడింది. టీమ్ బస్సులో మద్యం సేవిస్తున్న వీడియోలతో పాటు అతనిపై ఓ ఫిర్యాదు రావడంతో జయసింహను తక్షణమే పదవి నుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అర్శనపల్లి జగన్‌మోహన్ రావు వెల్లడించారు.
శుక్రవారం వివిధ వాట్సాప్ గ్రూప్‌లు, వార్త చానెళ్లలో ప్రసారమైన వీడియోల ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇలాంటి తప్పులు చేసే వారిపై జీవితకాల నిషేధం విధించేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. విమెన్స్ టీమ్ ఏ టూర్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది? టీమ్ బస్‌లోకి మద్యం ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారనే దానిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామన్నారు.