- రెవెన్యూ గ్రోత్ అంచనాలు పెంపు
- షేరుకి రూ.12 మధ్యంతర డివిడెండ్
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ.4,235 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే 11 శాతం వృద్ధి నమోదు చేసింది. అదే ఈ ఏడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే కంపెనీ నెట్ ప్రాఫిట్ 0.5 శాతం తక్కువగా ఉంది. రెవెన్యూ మాత్రం సీక్వెన్షియల్‌గా 3 శాతం పెరిగి రూ.28,862 కోట్లకు చేరుకుంది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.26,672 కోట్లతో పోలిస్తే 8.2 శాతం గ్రోత్ నమోదు చేసింది.
ఎనలిస్టుల అంచనాలను అధిగమించడంతో హెచ్‌సీఎల్ టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ గైడెన్స్‌ను మెరుగుపరిచింది. 2024–25 లో రెవెన్యూ 3 శాతం నుంచి 5 శాతం గ్రోత్ నమోదు చేస్తుందని అంచనా వేసింది. నిలకడైన కరెన్సీ వద్ద క్యూ2 లో రెవెన్యూ సీక్వెన్షియల్‌గా 1.6 శాతం పెరిగిందని కంపెనీ ఎండీ సీ విజయ్‌కుమార్ అన్నారు. అన్ని బిజినెస్ సెగ్మెంట్లలో, అన్ని ప్రాంతాల్లో గ్రోత్ నమోదు చేశామని తెలిపారు.
సెప్టెంబర్ క్వార్టర్‌లో నికరంగా 2.21 బిలియన్ డాలర్ల విలువైన కొత్త డీల్స్‌ను కంపెనీ సాధించింది. జూన్ క్వార్టర్‌లో ఈ నెంబర్ 1.96 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను షేరుకి రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వాలని హెచ్‌సీఎల్ టెక్ బోర్డ్ నిర్ణయించుకుంది. దీంతో 2024–25 కి గాను ఇప్పటివరకు ప్రకటించిన డివిడెండ్ షేరుకి రూ.42 కి చేరుకుంది. ఈ ఏడాది మేలో రూ.18, జూన్‌లో రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. హెచ్‌సీఎల్ టెక్ షేర్లు సోమవారం 1.38 శాతం పెరిగి రూ. 1,865 దగ్గర సెటిలయ్యాయి.