- నెట్ ప్రాఫిట్ 20 శాతం పెరిగి రూ.4,257 కోట్లకు
- రూ.28,024 కోట్లకు పెరిగిన రెవెన్యూ
న్యూఢిల్లీ: ఇండియాలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన హెచ్‌సీఎల్ టెక్‌కు ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ1) లో రూ. 4,257 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 20.4 శాతం, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 6.8 శాతం పెరిగింది. కంపెనీ రెవెన్యూ కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 6.7 శాతం వృద్ధి చెంది రూ.28,057 కోట్లకు చేరుకుంది.
ఈ ఏడాది మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 1.6 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెవెన్యూ 3 శాతం నుంచి 5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని హెచ్‌సీఎల్ టెక్ రెవెన్యూ గైడెన్స్ ఇచ్చింది. కంపెనీకి జూన్ క్వార్టర్‌లో రూ. 28,024 కోట్ల రెవెన్యూ, రూ.3,845 కోట్ల నికర లాభం వస్తాయని బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది. ఈ అంచనాలను హెచ్‌సీఎల్ రిజల్ట్స్ అధిగమించాయి. జూన్ క్వార్టర్‌లో కంపెనీ 1.96 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్ట్‌లను అందుకుంది. కానీ, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన మొత్తం కాంట్రాక్ట్ విలువ 2.29 బిలియన్ డాలర్లతో పోలిస్తే 14 శాతం తగ్గింది.
హెచ్‌సీఎల్ టెక్ షేర్లు శుక్రవారం సెషన్‌లో 3.30 శాతం లాభపడి రూ.1,562 వద్ద క్లోజయ్యాయి. ఏడాది ప్రాతిపదికన 5.6 శాతం రెవెన్యూ గ్రోత్‌తో (స్థిరమైన రూపాయి విలువ దగ్గర) ఇండస్ట్రీలో టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచామని హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ సీ విజయకుమార్ అన్నారు. తమ అంచనాల కంటే ఎక్కువగా రెవెన్యూ, ఇబిటా (ట్యాక్స్‌లు, వడ్డీల ముందు ప్రాఫిట్) వచ్చాయని చెప్పారు. కొత్తగా 2 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారాన్ని దక్కించుకున్నామని అన్నారు.