ఇండియాలోనే అత్యంత సంపన్న మహిళగా రోషిణి నాడార్

 ఇండియాలోనే అత్యంత సంపన్న మహిళగా రోషిణి నాడార్
  • రెండోస్థానంలో నైకా ఫాల్గుణీ నాయర్​
  • కిరణ్​ మజుందార్​ షాకు థర్డ్​ప్లేస్​

న్యూఢిల్లీ: ఐటీ సేవలు అందించే హెచ్‌‌సిఎల్ టెక్నాలజీస్ చైర్‌‌‌‌పర్సన్ రోషిణీ నాడార్ మల్హోత్రా ఇండియాలోనే అత్యంత సంపన్న మహిళగా రికార్డు కొట్టారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఈమె నెట్​వర్త్ 54 శాతం ఎగబాకి రూ. 84,330 కోట్లకు చేరుకున్నది.   దాదాపు పదేండ్ల క్రితం బ్యూటీ ఫోకస్డ్ బ్రాండ్ నైకాను ప్రారంభించేందుకు ఇన్వెస్ట్‌‌మెంట్ బ్యాంకింగ్ కెరీర్‌‌ను విడిచిపెట్టిన ఫాల్గుణి నాయర్ రూ. 57,520 కోట్ల నెట్​వర్త్​తో రెండో అత్యంత సంపన్న మహిళగా (సెల్ఫ్​మేడ్​) అవతరించారు. కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్–-‌‌‌‌హురున్ బుధవారం ప్రకటించిన లిస్టు ప్రకారం.. 59 ఏళ్ల నాయర్  ఈ సంవత్సరంలో తన సంపదను ఏకంగా 963 శాతం పెంచుకోగలిగారు. దీంతో ఆమె రెండవ అత్యంత సంపన్న మహిళగా స్థానం సంపాదించారు. ఫార్మా  కంపెనీ బయోకాన్‌‌కి చెందిన కిరణ్ మజుందార్-షా సంపద 21 శాతం తగ్గి  రూ. 29,030 కోట్లకు పడిపోయింది. దీంతో ఆమె ర్యాంకు మూడుకు పడిపోయింది.  ఈ లిస్టును మొత్తం 100 మంది భారతీయ మహిళా ఇండస్ట్రియలిస్టుల పేర్లతో తయారు చేశారు.  భారతదేశంలో పుట్టినవారు లేదా పెరిగినవారు, వారు తమ వ్యాపారాలను చురుకుగా నిర్వహిస్తున్నారు లేదా వ్యాపారంలో స్వయంగా ఎదిగిన వారితో దీనిని తయారు చేశామని కోటక్​–హురూన్​లు ప్రకటించాయి. ఈ 100 మంది మహిళల మొత్తం సంపద ఒక సంవత్సరంలో 53 శాతం పెరిగి 2020లో రూ. 2.72 లక్షల కోట్ల నుండి 2021లో రూ. 4.16 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ మొత్తం భారతదేశ నామినల్​ జీడీపీలో 2 శాతానికి సమానం.  టాప్–100 రిచెస్ట్​ విమెన్​ లో చేరడానికి కటాఫ్ అంతకుముందు రూ. 100 కోట్లు కాగా, ఇప్పుడు అది రూ. 300 కోట్లకు పెరిగింది.  టాప్–10 కటాఫ్ రూ. 6,620 కోట్లుగా ఉంది. ఇది పోయిన సంవత్సరంతో పోలిస్తే 10 శాతం ఎక్కువ.

హైదరాబాద్​ నుంచి 12 మంది
ఈ లిస్టులో అత్యధికులు  ఢిల్లీ–-జాతీయ రాజధాని ప్రాంతం  (25 మంది), ముంబయి (21), హైదరాబాద్ (12) నుంచి ఉన్నారు. సెక్టోరల్ వారీగా చూసినప్పుడు, భారతదేశంలోని టాప్– 100 మంది సంపన్న మహిళల్లో 12 మంది ఫార్మాస్యూటికల్స్ వ్యాపారంలో ఉన్నారు. 11 మంది ఆరోగ్య సంరక్షణ బిజినెస్​ చేస్తున్నారు.  కన్స్యూమర్ గూడ్స్​కు సంబంధించిన వ్యాపారాల్లో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌‌ప్రైజ్ ఈ జాబితాలోకి నాలుగు ఎంట్రీలను అందించింది. ఒకే కంపెనీ ద్వారా ఇంత మంది మహిళలు రిచెస్ట్​ విమెన్​​ లిస్టులోకి రావడం అరుదైన విషయం. దీని తర్వాత మెట్రో షూస్,  దేవీ సీఫుడ్స్‌‌ నుంచి రెండు చొప్పున ఎంట్రీలు వచ్చాయి. భోపాల్‌‌కు చెందిన జెట్‌‌సెట్‌‌గోకు చెందిన కనికా టేక్రివాల్ (33 ఏళ్లు) నెట్​వర్త్​ 50 శాతం పెరిగిరూ.420 కోట్లకు చేరుకుంది. ఈ లిస్టులో ఈమే అత్యంత చిన్న వయస్కురాలు. ఈ మహిళల్లో ముగ్గురు ప్రొఫెషనల్ మేనేజర్లు కూడా ఉన్నారు.  పెప్సికోలో పనిచేసిన ఇంద్రా నూయీ రూ. 5,040 కోట్ల సంపదతో లిస్టులో స్థానం సంపాదించారు. ఈమె భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అన్న విషయం తెలిసిందే. మార్ట్​గేజ్​ లెండర్​ హెచ్​డీఎఫ్​సీ చెందిన రేణూ సూద్ కర్నాడ్ రూ. 870 కోట్లు,  కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌కు చెందిన శాంతి ఏకాంబరం రూ. 320 కోట్ల  సంపాదనతో కోటక్​–హురూన్​ టాప్​–100 రిచెస్ట్​ విమెన్​ లిస్టులోకి వచ్చారు.