HCL New Rule: హెచ్సీఎల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే మీకో బ్యాడ్ న్యూస్ బాస్..!

HCL New Rule: హెచ్సీఎల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే మీకో బ్యాడ్ న్యూస్ బాస్..!

భారత ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కీలక సూచన చేసింది. ఉద్యోగుల లీవ్స్కు సంబంధించి కొత్త పాలసీని తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. ఈ కొత్త విధానంలోని నియమ నిబంధనల ప్రకారం.. హెచ్సీఎల్ టెక్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు వారంలో మూడు రోజులు ఆఫీస్ నుంచి పని చేయాల్సి ఉంటుంది. నెలలో కనీసం 12 రోజులు ఆఫీస్ నుంచి వర్క్ చేయాలి. ఈ రూల్ను ఉద్యోగులు లైట్ తీసుకుంటే అలాంటి ఉద్యోగులు లీవ్స్ విషయంలో ఇబ్బంది పడతారని హెచ్సీఎల్ హెచ్చరించింది. ఆ ఉద్యోగుల లీవ్స్ను ఎలాంటి మొహమాటం లేకుండా కుదించి పారేస్తామని ఉద్యోగులకు క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చింది. నెలకు 12 రోజులు ఆఫీస్కు రాకపోతే 12కి ఎన్ని రోజులు తగ్గితే అన్ని రోజుల లీవ్స్ కట్ అని కరాఖండిగా ఉద్యోగులకు హెచ్సీఎల్ చెప్పేసింది. 

హైబ్రిడ్ వర్క్ మోడల్ను అమలు చేసిన ఐదు నెలల తర్వాత హెచ్సీఎల్  ఈ నిర్ణయం తీసుకుంది. వారానికి మూడు రోజులు వర్క్ ఫ్రం ఆఫీస్ రూల్ను ఈ-మెయిల్ ద్వారా హెచ్ఆర్ ఇప్పటికే టీమ్స్కు సమాచారం అందించినట్లు ఒక ఉద్యోగి తెలిపారు. ఈ విధానం అమలులోకి రావడం వల్ల లీవ్స్ అయిపోతే లాస్ ఆఫ్ పే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉద్యోగులకు వస్తుందని సదరు ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ కొత్త పాలసీ అమలుపై హెచ్సీఎల్ టెక్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. క్లైంట్ కమిటిమెంట్స్కు తగినట్లుగా ఈ పాలసీని అమల్లోకి తీసుకొచ్చామని, తమ హైబ్రిడ్ వర్క్ పాలసీ మిడిల్ అండ్ సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. 

హెచ్సీఎల్ సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో, తొలి త్రైమాసికంలో లాభాల బాటలో పయనించింది. తొలి త్రైమాసికంలో రూ.4,257 కోట్ల నికర లాభం హెచ్సీఎల్ సాధించింది. ఇదిలా ఉండగా.. హెచ్సీఎల్ మాత్రమే కాదు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటును క్రమక్రమంగా తగ్గించేందుకు పలు ఐటీ కంపెనీలు వ్యూహాత్మక నిర్ణయాలను అమలు చేస్తు్ండటం కొసమెరుపు. 2024 ఆరంభంలోనే కాగ్నిజెంట్ కంపెనీ ఇండియాలో పనిచేస్తున్న తమ ఉద్యోగులు వారంలో మూడు సార్లు ఆఫీస్కు రావాలని స్పష్టం చేసింది. టీసీఎస్ వేరియబుల్ పే పాలసీని అమల్లోకి తెచ్చింది. ఉద్యోగుల ఆఫీస్ పని వేళలు 60 శాతం కంటే తక్కువగా ఉంటే వేరియబుల్ పే పొందే అవకాశం ఉండదని పేర్కొంది. 60 నుంచి 75 శాతం ఆఫీస్ అటెండెన్స్ ఉన్న ఉద్యోగులకే 50 శాతం వరకూ వేరియబుల్ పే పొందే అవకాశం ఉందని స్పష్టం చేసింది. డెల్ సంస్థ అయితే ఏకంగా ఉద్యోగుల అటెండెన్స్ ను ట్రాక్ చేయడానికి ఎలక్ట్రానిక్ బ్యాడ్జ్ స్వైప్స్, వీపీఎన్, కలర్-కోడెడ్ సిస్టమ్ను వాడుతోంది.