
- ఐఐఐటీ, గచ్చిబౌలి స్టేడియానికి కేటాయించింది యూనివర్సిటీ భూములే
- పలు ప్రైవేట్సంస్థలకు, టీఎన్జీవోలకూ కేటాయింపు
- నేటికీ యూనివర్సిటీ పేరిట బదలాయించలే
- యాజమాన్య టైటిల్ మార్పుపై దృష్టిపెట్టని హెచ్సీయూ అధికారులు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం 1975లో హెచ్సీయూకు కేటాయించిన 2,324 ఎకరాల భూములు క్రమంగా తగ్గుతూ వచ్చి ప్రస్తుతం 1,600 ఎకరాలకు చేరాయి. ఇప్పటికీ ఆయా భూముల యాజమాన్య టైటిల్ హెచ్ సీయూ పేరిట లేకపోవడంతో రికార్డుల్లో సర్కారు భూములుగానే ఉండిపోయాయి. దీంతో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆ భూముల్లో నుంచే వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు కేటాయిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ప్రైవేట్ వ్యక్తులు యూనివర్సిటీ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తున్నది.
1974లో హెచ్సీయూ ఏర్పాటు చేయగా.. 1975లో అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రభుత్వం యూనివర్సిటీకి 2,324 ఎకరాల భూమి కేటాయించింది. ప్రస్తుతం1600 ఎకరాలలోపే ఉండగా, దాదాపు 700 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు సమాచారం. ఆయా ప్రభుత్వాల తీరుతోపాటు యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కూడా ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తున్నది.
భూములు హెచ్సీయూ పేరు మీదికి మారలే..
హెచ్సీయూకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములు 50 ఏండ్లవుతున్నా ఇంకా యూనివర్సిటీ పేరు మీదికి ట్రాన్స్ఫర్కాలేదు. ఈ విషయాన్ని అప్పటి వీసీలు, రిజిస్ర్టార్లు పట్టించుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు.రికార్డుల్లో ఇప్పటికీ సర్కారు భూములుగా చూపిస్తుండడంతో ఆయా ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేట్ సంస్థలకు హెచ్సీయూ భూములను కేటాయిస్తూ వచ్చాయి. ఐఐఐటీ, గచ్చిబౌలి స్టేడియం, ఇతర కేంద్ర సంస్థలకూ హెచ్సీయూ భూములనే బదలాయించారు.
టీజీఎన్జీఓలకు 134 ఎకరాలు కేటాయించారు. ఓ రియల్ ఎస్టేట్సంస్థకు కూడా ఈ యూనివర్సిటీ భూములే అప్పగించారు. ఇటీవల కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో ఈ విషయాలన్నీ తాజాగా బయటకు వస్తున్నాయి. కాగా, ప్రస్తుతం హెచ్సీయూ వద్ద మిగిలి ఉన్న భూములకు టైటిల్ మార్పిడి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని హెచ్సీయూ అధికారులకు సూచించింది.
గోపనపల్లి భూములదీ ఇదే పరిస్థితి..
హెచ్సీయూను ఆనుకొని ఉన్న గోపనపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వానికి 397.16 ఎకరాల భూమి ఉండేది. కాగా, యూనివర్సిటీ, ప్రభుత్వ పరస్పర అవసరాల కోసం కంచ గచ్చిబౌలి గ్రామంలో హెచ్సీయూకు చెందిన 534.28 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర సర్కారుకు చెందిన గోపనపల్లిలోని 397.16 ఎకరాలు హెచ్సీయూకి 2004 జనవరిలో బదలాయించుకున్నారు. ఆ వెంటనే ప్రభుత్వానికి వచ్చిన 534.28 ఎకరాల నుంచి 400 ఎకరాలను అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు బిల్లీరావుకు చెందిన ఐఎంజీ భారత సంస్థకు కేటాయించారు.
వైఎస్ఆర్ సీఎం అయ్యాక 2006లో ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు. దీనిపై బిల్లీరావు కోర్టుకు వెళ్లడంతో సుదీర్ఘపోరాటం తర్వాత 2024 జనవరిలో ఈ భూములను రాష్ట్ర సర్కారు దక్కించుకుంది. మరోవైపు హెచ్సీయూకి ప్రభుత్వం ద్వారా వచ్చిన 397 ఎకరాలనూ సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ఈ భూముల్లో కబ్జాలు పెరిగి, నిర్మాణాలు వెలిశాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలకు భూకేటాయింపులు చేసినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో సర్వే చేస్తే తప్ప గోపనపల్లి భూముల్లో ఇంకా ఎన్ని భూములు మిగిలి ఉన్నాయనే విషయం తెలియదు. కాగా, హెచ్సీయూ భూ వివాదం తెరపైకి రావడంతో ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు అలర్ట్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటికి కేటాయించిన భూములు, ప్రస్తుతం అవి ఎవరి పేరిట ఉన్నాయో చెక్చేసుకునే పనిలో పడ్డాయి. మరోవైపు రెవెన్యూ శాఖ సైతం గతంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్సంస్థలకు కేటాయించిన భూముల వివరాలను లెక్కతీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములెన్ని? ఆయా సంస్థల చేతిలో ఉన్నదెంత? అన్యాక్రాంతమైనదెంత? టైటిల్ మారని సంస్థల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై దృష్టిపెడ్తున్నట్లు తెలిసింది.