రూ.500కే డీఎన్ఏ టెస్ట్.. రూ.18కే బ్లడ్ టెస్ట్

రూ.500కే డీఎన్ఏ టెస్ట్.. రూ.18కే బ్లడ్ టెస్ట్
  • ప్రోబయాటిక్స్ తో ఫేస్ క్రీమ్​లు వినూత్న ప్రొడక్టులు తెచ్చిన స్టార్టప్ లు 
  • హెచ్ సీయూ యాస్పైర్ అండతో సరికొత్త ఉత్పత్తులు  

హైదరాబాద్, వెలుగు: స్టార్టప్​లను ప్రోత్సహించేందుకు టీహబ్​ మాదిరిగానే.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్ సీయూ)లో ఏర్పాటు చేసిన ‘యాస్పైర్​’ ఇంక్యుబేటర్ ​అండతో పలు స్టార్టప్ లు సరికొత్త ఉత్పత్తులతో ముందుకొస్తున్నాయి.లైఫ్ ​సైన్సెస్ కోసం ప్రత్యేకంగా బయోనెస్ట్, టెక్నాలజీ కోసం టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్(టీబీఐ), టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్​మెంట్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్షిప్ వంటి విభాగాలను ఏర్పాటు చేసి సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. యాస్పైర్ ద్వారా ఇప్పటికే120కిపైగా స్టార్టప్​లకు ప్రోత్సాహాన్ని అందించినట్టు ఇంక్యుబేషన్ మేనేజర్ హర్షిత, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ కుశ్వంత్ కుమార్ చెప్పారు. అందులో 84 సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలను ప్రారంభించాయని తెలిపారు.   ప్రమీలా లైఫ్ ​సైన్సెస్ సంస్థ.. అందాన్ని సహజసిద్ధంగా ఇనుమడింపజేసే ఉత్పత్తులను, ప్రోబయాటిక్ బేస్​తో క్రీమ్​లను అక్షత బ్రాండ్ నేమ్ తో ఉత్పత్తి చేస్తున్నదని, దీనితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని సంస్థ డైరెక్టర్ సమత పాలడుగు, రీసెర్చ్ సైంటిస్ట్ సారేపల్లి సాయి సాత్విక్ వివరించారు. 

రూ.500కే డీఎన్ఏ టెస్ట్ 

కొందరికి కొన్ని మందులు పడవు. వారికి కరెక్ట్ గా సరిపోయే మందులను ఎంపిక చేస్తే ట్రీట్మెంట్ సమర్థంగా జరుగుతుంది. ఇందుకోసం డీఎన్ఏ టెస్ట్ అవసరం. ప్రస్తుతం పెద్ద సిటీల్లోనే, అది కూడా చాలా ఖర్చుతో మాత్రమే డీఎన్ఏ టెస్టులకు చాన్స్ ఉంది. అందుకే ‘మినీ డీఎన్ఏ ల్యాబ్’ పరికరంతో చక్కటి పరిష్కారం చూపించింది 30 ఎం జీనోమిక్స్ అనే సంస్థ. రూ.500కే డీఎన్ఏని టెస్ట్ చేసి.. వారి జన్యువుల ఆధారంగా ఏ ఔషధాలు సూట్ అవుతాయో గంటలోపే చెప్తుందీ మెషీన్. ఈ మెషీన్​ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లేందుకు వీలుంటుందని సంస్థ సీఎస్​వో పావని చెప్పారు.  

రూ. 18కే బ్లడ్ టెస్ట్  

పేదలకు అందుబాటు ధరలోనే  బ్లడ్​ టెస్టు చేసేందుకు నోయిడాకు చెందిన మొబిల్యాబ్ అనే సంస్థ ఓ ప్రత్యేక పరికరాన్ని తయారు చేసింది. దానికి ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ హంగులనూ అద్దింది. శాంపిల్​ను సేకరించేందుకు ప్రత్యేక నీడిల్ వ్యవస్థతో పాటు ఆ మెషీన్​లోనే ప్లాస్మా, సీరమ్​ను వేరుచేసే సెంట్రిఫ్యూజ్, టెస్టుల కిట్ ఏర్పాటు చేస్తారు. ఏ టెస్ట్​ చేయాలో అందులోనే ఆ వయల్​ను పెట్టాల్సి ఉంటుంది.  టెస్ట్ అయిపోగానే ఆ రిజల్ట్​ను రిజిస్టర్ అయిన మొబైల్​కు ఏఐ సిస్టమ్​ పంపిస్తుందని సంస్థ డిప్యూటీ మేనేజర్​ భవేశ్ సోలంకి తెలిపారు. దేశంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ పరికరాలను సప్లై చేస్తున్నామన్నారు.