
భూమి మనదేశంలో అత్యంత విలువైన ఆస్తి. అంతేకాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. రైతుల జీవితాలలో భూమి పట్టా, భూమిపై హక్కులు, భూ లావాదేవీలు ఎంతో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. భూమికి సంబంధించిన లావాదేవీలు సజావుగా జరగకపోయినట్లయితే రైతులు మానసికంగా ఇబ్బందులతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతారు. అందుకే భూమికి సంబంధించిన నిర్వహణలో పారదర్శకత, సత్వర న్యాయం అత్యంత కీలకపాత్రను పోషిస్తాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమికి సంబంధించిన అన్ని వివరాలను, లావాదేవీలను డిజిటలైజేషన్‌తోపాటు, సులభతరం చేసి భూ సంబంధిత వివాదాలన్నీ అరికట్టాలని సంకల్పించింది. ఈ సంకల్పంతోనే 2020లో ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. మొదట్లో ఇది కొంత సత్ఫలితాలను ఇచ్చినట్టు కనిపించినప్పటికీ, ఆ తర్వాత కాలంలో పూర్తిగా లోపభూయిష్టమైన విధానంగా తయారయింది. రైతుకు, భూమికి ఒక విడదీయరాని బంధం పెనవేసుకొని ఉంటుంది. ఆనాడు ధరణి పేరుతో భూ రికార్డుల ప్రక్షాళన చేస్తామని, అడ్డదిడ్డంగా పహానీల్లో స్కేల్‌తో కొలతలు పెట్టి, భూ సరిహద్దుల విషయంలో అనేక తగాదాలకు కారణమైంది.
నిర్లక్ష్య పూరితమైన భూనిర్వహణతో కొంతమంది రైతుల భూమికి పట్టా కనిపించకపోవడం, ఒకరి భూమికి ఇంకొకరి పేరుతో పట్టా రావటం, మరి కొన్నిచోట్ల సరిహద్దుల్లో తీవ్రమైన విభేదాలు రావడంతో రైతన్నలు, పడరాని అగచాట్లు ఎన్నోపడ్డారు. అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల భూ సమస్యలపై ఆనాటి ప్రభుత్వ అనధికార పత్రిక ‘ధర్మగంట’పేరుతో అనేక రోజులు పత్రిక నిండా కథనాలు ప్రచురించింది. రైతులు పడుతున్న బాధలు, వెతలు, సమస్యలను ధారావాహిక కార్యక్రమాన్ని కొనసాగించి, కనీసం కంటితుడుపు మాదిరిగానైనా ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయలేదు.
వెలకట్టలేని, తిరిగిరాని నష్టం ధరణి వల్ల కలిగింది. సమస్యల పరిష్కారం కోసం ప్రకటనలు అయితే చేసింది కానీ అణువంతైనా పురోగతి సాధించలేకపోవడం ప్రజలు మర్చిపోలేదు. నిజాం నవాబు కాలంలో తెలంగాణ భూముల సర్వే జరిగి ఆ సరిహద్దుల నిర్ణయాలు జరిగాయి. గత ప్రభుత్వం తెలంగాణలో ప్రతి ఇంచు భూమి సర్వే చేపట్టి సరిహద్దులను నిర్ణయించి, అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా హద్దులను పెట్టి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తామని చెప్పినప్పుడు, రైతులు ఎంతో ఆనందపడి ఆశగా ఆ సర్వే కోసం ఎదురుచూసినా నిరాశ తప్పలేదు.
భూరికార్డుల ప్రక్షాళనలో జాప్యం
భూ తగాదాలతో అన్నదమ్ములు, అక్కచెల్లెలు, దగ్గరి బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు అందరూ కూడా శత్రువులుగా మారిన వైనం ప్రజలు మరువలేనటువంటిది. 2021– 22 బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు కేటాయించి భూ రికార్డులు డిజిలైజేషన్ చేస్తామని పేర్కొన్నప్పటికీ నేటికీ అది అసంపూర్తిగానే ఉంది. 2024 –25 బడ్జెట్లో గవర్నమెంట్ 500 కోట్ల రూపాయలను కేటాయించి భూ సర్వేను మరింత పటిష్టం చేస్తాం, ధరణి లోపాలు పరిష్కరించి రైతులకు పూర్తి భరోసాను ఇస్తామని పేర్కొన్నప్పటికీ నేటికీ ఆ కార్యక్రమం ముందుకు వెళ్లకపోవడం విచారకరం. ధరణి రద్దు తర్వాత వచ్చిన భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశ ఉన్నా రైతులకు ఎదురవుతున్న అనుమానాలు, కార్యాచరణలోని సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. భూసమస్యలకు నిజమైన పరిష్కారం ఎప్పుడో? అనే ప్రశ్న ఇప్పటికీ మిగిలే ఉంది.
భూ రికార్డుల ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం, బంజరు భూములను, గ్రామకంఠాలకు సంబంధించిన భూములను గుర్తించి, ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వేలం వెయ్యటానికి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ధరణి పోయినా, భూభారతి కార్యక్రమం బలంగా ముందుకు పోకపోవడంతో రైతన్నల్లో నిరుత్సాహం కొనసాగుతోంది. అయితే, ధరణి నుంచి భూ భారతి వరకు మారిన పాలసీల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ధరణి పోర్టల్‌లో నమోదైన రికార్డుల గందరగోళం, భూమి రికార్డుల ప్రక్షాళనలో జాప్యం, భూమి మ్యుటేషన్‌లో సమస్యలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవాంతరాలు ఇవన్నీ రైతులకు నిత్య ఇబ్బందులను కలిగిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని రైతులు ఆశిస్తున్నప్పటికీ, అమలు ప్రాతిపదికలో అనేక సవాళ్లు మిగిలే ఉన్నాయి.
గ్రామ పంచాయతీల భాగస్వామ్యం అవసరం
భూమి క్రయవిక్రయాలలో గ్రామ పంచాయతీల భాగస్వామ్యం చాలా అవసరం. భూభారతి వ్యవస్థ కేవలం రెవెన్యూ అధికారుల అధీనంలో ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో పంచాయతీల భాగస్వామ్యం లేకపోవడం వల్ల రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. భూమి మ్యుటేషన్, క్రయవిక్రయాలు, హక్కుల నమోదు వంటి అంశాలలో గ్రామపంచాయతీలు కీలకపాత్ర పోషించాలి. పంచాయతీ స్థాయిలో రెవెన్యూ అధికారులతో కలిసి భూమి లావాదేవీలను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ చేయవలసిన అవసరం ఉంది. రైతుల ప్రయోజనాలు కాపాడేవిధంగా తాజా బడ్జెట్లోనైనా భూ సర్వేకు సంబంధించి నిధులను కేటాయించాలి.
టెక్నికల్ సపోర్ట్ టీంను ఏర్పాటు చేయాలి
రికార్డులు లేని కారణంగా రైతులకు భూమి సమస్యలు ఏర్పడ్డాయి. భూమి యాజమాన్య వివరాలు, పరిమాణం, భూమి శ్రేణి సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక సర్వేలను చేపట్టాలి. గ్రామీణ స్థాయిలో భూపట్టాల ఆధారంగా భూమి విభజనను పున:సమీక్షించి రైతులు, స్థానిక అధికారుల సమక్షంలో ధ్రువీకరణ పత్రాలు అందించాలి. భూమి రికార్డుల ప్రక్షాళన పూర్తి అయిన వెంటనే భూ విలువలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యల కోసం కృషి చేయాలి. గ్రామస్థాయిలో డిజిటల్ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు వారి భూములకు సంబంధించిన వివరాలను అక్కడే చూసుకునేవిధంగా వెసులుబాటు కల్పించాలి.
రైతులకు తమ ముందు వివరాలను నమోదు చేసుకోవడానికి, అవసరమైన మార్పులు చేసుకోవడానికి, మ్యుటేషన్ మొదలైన ప్రక్రియను అనుసరించేందుకు సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలి. నేటి భూభారతి అమలులో వస్తున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడం చాలా కీలకమైనది. ప్రస్తుతం పోర్టల్‌లో రికార్డులు నమోదు చేసే సమయంలో వ్యవస్థ చాలా నెమ్మదిగా స్పందించడం, ఓవర్ లోడింగ్ ఇలాంటి సమస్యలు తలెత్తడంతో చాలా నెమ్మదిగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అవసరమైతే ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన టెక్నికల్ సపోర్ట్ టీంను ఏర్పాటు చేసి, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులను వినియోగించుకొని ఈ సమస్యల నుంచి గట్టెక్కవచ్చు.
చిట్టెడి కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్సీయూ