హెచ్​సీయూ భూములు విద్యకు, పర్యావరణానికే వాడాలి

హెచ్​సీయూ భూములు విద్యకు, పర్యావరణానికే వాడాలి

తొలి దశ  తెలంగాణ ఉద్యమం ఫలితంగా సిక్స్ పాయింట్ ఫార్ములా  భాగంగా హైదరాబాద్  కేంద్ర  విశ్వవిద్యాలయం ఏర్పడింది.  తదనుగుణంగా పార్లమెంట్​లో  ప్రత్యేక చట్టం ద్వారా ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీ  కోసం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం 2,374 ఎకరాల భూమిని కేటాయించింది.  అది భారత ప్రభుత్వ గెజిట్లోనూ పేర్కొనడం జరిగింది.  అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూమిని  కేటాయించింది కానీ, ఆ భూమి యూనివర్సిటీ పేరుమీద మార్చలేదు. 

ఆనాటి నుంచి నేటి వరకు అన్ని రాజకీయ పక్షాలకు అధికారం లభించినప్పటికీ యూనివర్సిటీ భూములకు  సంబంధించి యాజమాన్యం హక్కులను యూనివర్సిటీకి అప్పజెప్పలేదు.  దానికి తోడు  ప్రభుత్వం అనేక సందర్భాల్లో  ప్రజాసంక్షేమం పేరుతో వందల ఎకరాల భూమిని అవసరాలకు వాడుతూనే వస్తోంది. మరొక వైపు నగర పర్యావరణానికి  గండి  కొడుతూనే వస్తున్నారు.

జవహర్ నవోదయ పాఠశాల,  హెచ్​సీయూ బస్సు డిపో,  గచ్చిబౌలి స్టేడియం,  ట్రిపుల్​ ఐటీ,  టాటా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్,  షూటింగ్ రేంజ్, శేరిలింగంపల్లి ఎమ్మార్వో ఆఫీస్,  టీఎన్జీవోస్ కాలనీ లాంటి వాటికి దాదాపుగా ఎనిమిది వందల ఎకరాలు భూమిని ఇవ్వడం జరిగింది.  దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం 2004లో  క్రీడా సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్న పేరుతో  ఐఎంజి భారత్ ప్రైవేట్ లిమిటెడ్​కు రాష్ట్ర ప్రభుత్వం భూములను కేటాయిస్తూ యూనివర్సిటీ కూడా ఒక అవగాహనకి ఒప్పందానికి రావడం జరిగింది.  

ఆ సంస్థతో ఒప్పందం ముగిసిపోయిన తర్వాత ఆ భూమిని న్యాయబద్ధంగా ప్రభుత్వం యూనివర్సిటీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది.  దీనికోసం ప్రత్యామ్నాయంగా  దాదాపుగా 400 ఎకరాలు  గోపనపల్లి వైపు ఇచ్చామని చెప్తున్నప్పటికీ అక్కడ కూడా, అదే భూమిని టాటా ఇన్​స్టిట్యూట్,  ఎన్ఐఏబి  సంస్థల కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిన విషయాన్ని కూడా గమనించాలి.

వర్సిటీ భూములపై నిర్లక్ష్యం

నేడు తెలంగాణ రాష్ట్రంలో విద్యాలయాలు కనీస మౌలిక వసతులు లేక,   విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందలేక రెండు దశాబ్దాలకుపైగా తల్లడిల్లుతున్నారు.  ఈ ప్రాంతానికి  హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ఒక దిక్సూచిగా పనిచేస్తోంది. యూనివర్సిటీ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పైగా అవుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా, ఆనాటి నుంచి నేటి వరకు  వివిధ కారణాల చేత యూనివర్సిటీకి కేటాయించిన భూమిని లాక్కోవడం నిత్యం జరుగుతూనే ఉంది.  నేటి  ప్రభుత్వం మరొక ముందడుగు వేస్తూ ఈ భూములను విద్యా సంస్థలకు కాకుండా, పూర్తిగా ఐటీ, ఇతర కార్యక్రమాల కోసం వాడుకుంటామని, బహిరంగ వేలం ద్వారా అమ్ముతామని లేదా లీజుకు ఇస్తామని  ప్రకటించడం చాలా బాధాకరం. 

హెచ్​సీయూ భూములపై సర్వే చేపట్టాలి

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులు కూడా.. యూనివర్సిటీకి ఈరోజు వరకు  పూర్తిస్థాయి హక్కులు లేవని చెప్పడం మనం గమనించాలి. మరి ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎవరి భూములపైన  ఇంతకాలం నిర్మాణాలు చేపట్టింది, ఎలక్ట్రిసిటీ బిల్లులు, నీటి పన్నులు చెల్లిస్తోంది. 50 సంవత్సరాలుగా  పూర్తిగా యూనివర్సిటీ నిర్వహణలో ఉన్న ఈ భూమికి యజమానులు ఎవరు?  అసలు యూనివర్సిటీకి ఎంత భూమి ఉంది అని చెప్పేది ఎవరు? 

 ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం  ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూములపైన సర్వే చేపట్టి  ఏ సర్వే నెంబరు ద్వారా ఎంత భూమి 
యూనివర్సిటీకి ఉందో  నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.  కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతం చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, అవసర
మైతే  కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి మరొకచోట భూమిని ఇప్పించైనా యూనివర్సిటీకి చెందిన భూమిని తిరిగి ఇప్పించే ప్రయత్నం తన భుజస్కంధాలపై వేసుకో
వాలి.  దాంతో ఇటు విద్యావ్యవస్థను, అటు పర్యావరణాన్ని  కాపాడినట్టు అవుతుంది.


హెచ్​సీయూకి యాజమాన్య హక్కులు కల్పించాలి


హైదరాబాద్ మహానగరంలో అనేక ఐటీ,  పారిశ్రామిక, సేవారంగ సంస్థలు నెలకొల్పి భారీగా ఉపాధి కల్పించడం హర్షణీయం. అయితే, ఇప్పటికే  జన ప్రాబల్యం పెరిగిపోయి  ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలతో నిత్యం అలమటిస్తున్న ప్రజలపై  మరింత భారం  వేయకూడదు. హైదరాబాద్ మహానగరం చుట్టూ  కొత్త సంస్థలను ఏర్పాటు చేసి అక్కడ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైన ఉంది.  

కాబట్టి, కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని యూనివర్సిటీకి  కేటాయించడంతోపాటు, యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో  పూర్తిస్థాయిలో సర్వే చేసి యూనివర్సిటీకి యాజమాన్య హక్కులను అప్పగించాలి.  ప్రభుత్వం  తన చిత్తశుద్ధిని,  బాధ్యతను నిర్వర్తించాలని యూనివర్సిటీ  ముక్తకంఠంతో  కోరుకుంటోంది.  

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల  భవిష్యత్తుకు  భంగం కలగకుండా,  సహజ సిద్ధమైన ప్రకృతి సంపాదన కాపాడటం కోసం,  వాటిని మరింత బలోపేతం చేసేందుకు తగిన ప్రణాళికలు రచించాలి.  అద్భుతమైన విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దడంతో పాటు, ప్రకృతిని కూడా పరవశింపజేసే పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవాలని  యూనివర్సిటీ లోకం ఆశగా ఎదురుచూస్తోంది.

ఆక్సిజన్​ అందిస్తున్న వృక్షసంపద

యూనివర్సిటీకి  చెందిన భూముల సమస్య ఒకవైపు అయితే మరొకవైపు హైదరాబాద్ మహానగరానికి ఆక్సిజన్ అందిస్తున్న అద్భుతమైన పచ్చని వృక్ష సంపద,  అనేక జీవరాశులకు 50 సంవత్సరాలుగా నిలయమైన సంపదని నిర్దాక్షిణ్యంగా వందల బుల్డోజర్లతో  తీసివేయడం కూడా అత్యంత బాధాకరం.  ఢిల్లీలాంటి మహానగరంలో కాలుష్య కోరల్లో చిక్కుకుని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నేడు  మన కళ్లముందు కనబడుతోంది. అయినప్పటికీ ఈ ప్రకృతి సంపదను వినాశనం చేస్తే  రాబోయే రోజుల్లో  విపత్కర పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. 

 రాష్ట్ర భవిష్యత్తు కోసం, అద్భుతమైన కొత్త పట్టణాల నిర్మాణం కోసం,  ఫ్యూచర్ సిటీ లాంటి కార్యక్రమాలను తెలంగాణ ప్రాంత నలుమూలల్లో  ఏర్పాటుచేసి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి  ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. కానీ, హెచ్​సీయూ భూములు హైదరాబాద్​ ఊపిరితిత్తులుగా  పనిచేస్తున్నాయి. పర్యావరణాన్ని దెబ్బతీసి నగరాన్ని మరింత కాలుష్యకారకంగా మార్చుకోవాలని ప్రజలెవరూ కోరుకోరు.  అందుకే, 400 ఎకరాల భూమిని అమ్మకానికి లేదా లీజుకు ఇవ్వడానికి  ప్రజలెవరూ అంగీకరించరు.

- చిట్టెడి కృష్ణారెడ్డి,
అసోసియేట్ ప్రొఫెసర్, 
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

  • Beta
Beta feature
  • Beta
Beta feature