‘అస్పృశ్యులపై దాడులు ఆగకపోతే నేనే రాజ్యాంగాన్ని తగులబెడతాను’ అన్నారు బాబా సాహెబ్ బీఆర్.అంబేద్కర్.
ఆ మాటను ఆయన 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చిన రోజే అన్నారు. అలా ఆయన ఆ ఒక్కసారే కాదు, రాజ్యాంగంలో బలవంతులకు వెసులుబాటు కల్పించాలని ఈ దేశ అగ్రవర్ణ నేతలు ప్రయత్నాలు చేసినప్పుడల్లా అన్నారు. ఇవాళ రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75 సంవత్సరాల తరువాత కూడా బాధితులకు న్యాయం దక్కడం లేదు అనడానికి రోహిత్ వేముల ఉదంతమే నిలువెత్తు నిదర్శనం.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016 జనవరి 17న రోహిత్ వేముల చంపివేయబడ్డాడు. దీనిని అందరు ఆత్మహత్యగానే భావిస్తారు. కానీ, ఇది ఈ దేశ కులవ్యవస్థ చేసిన దళితుడి హత్య. తాజాగా రోహిత్ వేముల కేసును గురించి పోలీస్ వ్యవస్థ సంచలన ప్రకటన చేసింది. ఆ కేసులోని నిందితులకు క్లీన్ చిట్ ఇస్తూ, కేసును మూసివేస్తాం అని ప్రకటించడమే ఈ సంచలనానికి కారణం.
కులవ్యవస్థ చేసిన హత్య!
బాధితుల మీద బండలు వేయడం మన దేశంలో సర్వసాధారణమైన విషయంగా మారింది. దీంతో కేంద్రంలో ఉన్న అగ్రవర్ణ పాలకులు చాలా సులభంగా అనేక కేసుల్లో నిందితులను సులభంగానే తప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రోహిత్ వేముల చావుకు కారణమైన నిందితులను కూడా తప్పించే కుట్ర పెద్దమొత్తంలో జరుగుతోంది. ఇందుకోసం పోలీసు వ్యవస్థను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటున్న వైనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కూలి పనులు చేసుకుంటూ తన కొడుకును ప్రయోజకుడిని చేయాలని కలలు కన్న దళిత తల్లి వేముల రాధిక ఆశ అడియాసగానే మిగిలింది. చెట్టంత కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లి దీనావస్థను చూసైనా ఈ రాజ్యం ఆమెకు న్యాయం చేయకపోగా ఆమెను దళితురాలు కాదని తేల్చేపని మీదే దృష్టి సారించింది. పైగా అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన రోహిత్ వేముల మీద లేనిపోని అభాండాలు వేసింది. అతడు దళితుడే కాదని, అందువల్ల బీజేపీ, ఏబీవీపీ నేతల మీద పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు చెల్లదు అని నిర్ధారించింది.
రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి
రోహిత్ చనిపోయిన ఎనిమిదేండ్ల తరువాత ఆ కేసును మూసివేసి, నిందితులను తప్పించడానికి సిద్ధం కావడమంటే డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు ఈ దేశంలో పేదోడికి న్యాయం దక్కకపోవడమే అవుతుంది. పోలీసులు రోహిత్ దళితుడు కాదని చెప్పడం హాస్యాస్పదం. పోలీసులు కోర్టుకు సమర్పించిన 60 పేజీల నివేదికలో 40 పేజీలు రోహిత్ దళితుడు కాదని నిరూపించేందుకే కేటాయించడం క్షమించరాని విషయం. రోహిత్‌ను కన్నతల్లి రాధిక వేముల కుటుంబీకులు, బంధువులుగానీ ఏ ఒక్కరైనా అట్లా సాక్ష్యం చెప్పారా? అసలు రోహిత్ చావుకు కారణమైన అగ్రవర్ణ వీసీని, ఏబీవీపీ నాయకుల ప్రమేయం విషయంలో పారదర్శకత లోపించిన విషయం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
సరే, ఒకవేళ పోలీసులే చెప్పినట్టు రోహిత్ దళితుడు కాకుండా బీసీ అయితే దోషులకు శిక్ష పడొద్దా?! మాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితుల ఫోన్లే ట్యాపింగ్ చేయగల చాకచక్య సామర్థ్యం ఇవాళ పోలీస్ వ్యవస్థలో నెలకొని ఉంది. మరి ఇట్లా బాధితులకు న్యాయం దక్కకుండా చేస్తున్న తీరు విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కల్పించుకొని బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రజలకు క్రమంగా చట్టం మీద, వ్యవస్థ మీద నమ్మకం సడలిపోవడం ఖాయం.
చట్టంపై సన్నగిల్లుతున్న విశ్వాసం!
సాధారణంగా సమాజంలో సామాజికంగాను, ఆర్థికంగా బలవంతులుగా ఉన్నవారు ఇలాంటి కేసుల విషయంలో ఎంతటి క్రూరంగా ప్రవర్తిస్తారో బిల్కిస్ బానో లాంటి కేసులు ఎన్నోచూశాం. 11మంది రేపిస్టులను నిర్దోషులుగా విడుదల చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కింది. ఇట్లాగే ఢిల్లీలో మహిళా రెజ్లర్లు తమపై లైంగిక దాడులు జరిగాయని రోడ్డెక్కినా సరే బీజేపీ సర్కార్ పట్టించుకోలేదు. ఆఖరికి సుప్రీంకోర్టు కల్పించుకుంటేనే ఆ కేసు విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇలాంటి కేసులను చూసినపుడు ఈ దేశంలో న్యాయం అనేది పేదోడికి దక్కడం అసాధ్యం అనే సంకేతాలను అందిస్తున్నాయి.
అందుకు ఆధారంగా నిలుస్తున్నది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ పాలన. అందుకే ఇప్పుడు దళితులు, మైనారిటీల సంక్షేమం కోరి సెక్యులర్ వాతావరణాన్ని దేశంలో రక్షించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ రోహిత్ వేముల వంటి కుటుంబాలకు అండగా నిలవాలి. రోహిత్ కుటుంబానికి న్యాయం దక్కాలంటే...రోహిత్ చావుకు కారణమైన దోషులందరికీ కఠిన శిక్ష పడాలి. ఇందుకోసం ట్రయల్ కోర్టులోనే కాదు సుప్రీంకోర్టులో సైతం సవాల్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే రోహిత్ చావుకు కారణమైన నిందితులు ఈ కేసు నుంచి తప్పించుకోలేరు. తద్వారా సామాన్యులు సైతం చట్టం పట్ల విశ్వాసం కోల్పోకుండా ఉండే అవకాశం ఉంటుంది.
ఆత్మహత్యల అడ్డాగా హెచ్‌సీయూ
అసలు రోహిత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయాన్ని పక్కన పెట్టేసి, రోహిత్ కులం దళిత కులం కాదని తేల్చేందుకే పోలీసులు తమ ఆసక్తిని అధికంగా కనబరిచారు. ఇది ఎంత దారుణమైన విషయం. ఒక భావి భారత సైంటిస్ట్‌గా ఎదగాల్సిన ఒక ఆణిముత్యంలాంటి స్కాలర్ అర్ధాంతరంగా కులం వల్ల ప్రాణాలు కోల్పోయాడనే కనీసమైన సోయి లేకుండా పోలీసులే కేసును పక్కదోవ పట్టించడం విషాదాల్లోకెల్ల విషాదం. పోలీసులు నిజాయితీగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే.. అసలు హెచ్‌సీయూలో ఎందుకు విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి? 2001 నుంచి 2016 వరకు సుమారు 11మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే. మరి ఎందుకు ఈ కులాలకు సంబంధించిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో పోలీసులే చెప్పాలి.
అంటే అక్కడ కుల వివక్ష రాజ్యమేలుతోందనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నా సరే పోలీసుల దృష్టి అటువైపు మళ్లిందే లేదు. ఇలాంటి వివక్షా పూరితమైన విచారణలు మరిన్ని చావులకు పురుడుపోస్తాయి. రోహిత్ కేసులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలుపంచుకున్న వారంతా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులు. వారు తలుచుకుంటే తిమ్మిని బమ్మిని చేయగలరు. అదే చేస్తున్నారు క్యాంపస్ ఏబీవీపీ నాయకులు, వీసీ దగ్గరి నుంచి ఢిల్లీ పార్లమెంట్‌లో ఆసీనులవుతున్న వారందరికీ రోహిత్ హత్యతో సంబంధం ఉందని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు కోడై కూస్తున్నా సరే పోలీసు వ్యవస్థ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటైన విషయం.
కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేయాలి?
‘జస్టిస్ ఫర్ వేముల’ ఉద్యమంలో పాలుపంచుకున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ఆనాడు హామీ ఇచ్చాడు. తప్పకుండా యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల పట్ల కొనసాగుతున్న కుల, మత వివక్షను రూపుమాపేలా రోహిత్ వేముల చట్టం తీసుకొస్తామని చెప్పారు. రోహిత్ తల్లి కూడా జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసి తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకుంది. మరి ఇవాళ బీజేపీ పాలకులు రోహిత్ కుటుంబానికి అన్యాయం చేయడానికి పోలీసుల చేత అసంబద్ధమైన క్లీన్ చిట్‌లు ఇప్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్పందించడం ఆహ్వానించ దగిన పరిణామం. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ఏఐసీసీ నాయకులు కేసీ వేణుగోపాల్ రోహిత్ వేముల కేసును పునర్ విచారణ చేపడతాం అని ప్రకటించడం హర్షణీయం.
- డా. పసునూరి రవీందర్,
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత