
2024-25 నాలుగో క్వార్టర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాండెలోన్ లాభం 6.6 శాతం పెరిగి రూ.17,616 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.16,512 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.89,488 కోట్లకు పెరిగిందని, గత ఏడాది ఇదే కాలంలో రూ.89,639 కోట్లని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. వడ్డీ ఆదాయం రూ.77,460 కోట్లుగా నమోదైంది.
ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ.71,473 కోట్లుగా ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు బోర్డు ఈక్విటీ షేరుకు రూ.22 చొప్పున డివిడెండ్‌ను సిఫార్సు చేసింది. ఆస్తి నాణ్యత కొద్దిగా తగ్గింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) మార్చి 2025 చివరి నాటికి స్థూల రుణాలలో 1.33 శాతానికి పెరిగాయి. ఇది సంవత్సరం క్రితం 1.24 శాతంగా ఉంది. నికర ఎన్‌పీఏలు గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ చివరిలో 0.33 శాతం నుంచి 0.43 శాతానికి పెరిగాయి.
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 6.8 శాతం పెరిగి రూ.18,835 కోట్లకు చేరుకుంది. గత నాలుగో క్వార్టర్లో ఇది రూ.17,622 కోట్లు ఉంది. మార్చి 31, 2025 నాటికి మొత్తం బ్యాలెన్స్ షీట్ సైజు రూ.39.10 లక్షల కోట్లు కాగా, మార్చి 31, 2024 నాటికి రూ.36.17 లక్షల కోట్లుగా నమోదైంది.