- రూ. 36,019 కోట్లకుపెరిగిన ఎన్‌పీఏలు
- అప్పుల్లో వృద్ధి 3 శాతం..డిపాజిట్లు 16 శాతం అప్
- సుమారు 2 శాతం పెరిగిన బ్యాంక్ షేర్లు
న్యూఢిల్లీ:అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీకి కిందటేడాది డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్(క్యూ3) లో రూ.16,735.50 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముం దు ఏడాది డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే కేవలం 2.2 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది.
నికర వడ్డీ ఆదాయం (అప్పులపై వచ్చిన వడ్డీ మైనస్ డిపాజిట్లపై ఇచ్చిన వడ్డీ) 7.7 శాతం వృద్ధి చెంది రూ.30,650 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్ 3.43 శాతంగా , ఇతర ఆదాయం రూ.11,450 కోట్లుగా రికార్డయ్యాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు క్యూ3 లో ఇన్వెస్ట్‌మెంట్లపై వచ్చిన లాభం రూ.70 కోట్లకు తగ్గింది. 2023 డిసెంబర్ క్వార్టర్‌లో ఈ బ్యాంక్ ఏకంగా రూ.1,470 కోట్ల లాభాలను గడించింది. బ్యాడ్ లోన్ల కోసం చేసే ప్రొవిజన్లు, కాంటింజెన్సీలు రూ.3,150 కోట్లకు దిగొచ్చాయి. 2023 డిసెంబర్ క్వార్టర్‌లో రూ. 4,220 కోట్లను బ్యాడ్ లోన్ల కోసం బ్యాంక్ పక్కన పెట్టింది.
పెరిగిన మొండిబాకీలు..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొండిబాకీలు (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ –ఎన్‌పీఏ) క్యూ3 లో రూ.36,019 కోట్లకు పెరిగాయి. 2024 సెప్టెంబర్ క్వార్టర్‌లో గ్రాస్ ఎన్‌పీఏలు రూ.34,251 కోట్లుగా, 2023 డిసెంబర్ క్వార్టర్‌లో రూ.31,012 కోట్లుగా నిలిచాయి.
గ్రాస్ ఎన్‌పీఏల రేషియో సెప్టెంబర్ క్వార్టర్‌లో 1.36 శాతంగా ఉంటే, డిసెంబర్ క్వార్టర్‌లో 1.42 శాతానికి పెరిగింది. 2023 డిసెంబర్ క్వార్టర్‌లో 1.26 శాతంగా నమోదైంది. నెట్ ఎన్‌పీఏల రేషియో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రకారం 0.41 శాతం నుంచి, ఏడాది ప్రాతిపదికన 0.31 శాతం నుంచి 0.46 శాతానికి ఎగిసింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇచ్చిన మొత్తం అప్పులు కిందటేడాది డిసెంబర్ 31 నాటికి రూ.25.4 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏడాది ప్రాతిపదికన 3 శాతం వృద్ధి చెందాయి. రిటైల్ లోన్లు 10 శాతం, కమర్షియల్ అండ్ రూరల్ బ్యాంకింగ్ లోన్లు 11.6 శాతం, హోల్‌సేల్ లోన్లు 10.4 శాతం వృద్ధి చెందాయి.
బ్యాంక్ దగ్గరున్న మొత్తం డిపాజిట్ల విలువ ఏడాది ప్రాతిపదికన ఏకంగా 15.8 శాతం పెరిగి రూ.25.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ (కాసా) డిపాజిట్లు 4.4 శాతం పెరిగాయి.
సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు రూ. 6.05 లక్షల కోట్లకు, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు రూ.2.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బ్యాంక్ దగ్గరున్న మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్ల వాటా 34 శాతంగా ఉంది. బుధవారం సెషన్‌లో మార్నింగ్ మొత్తం డల్‌గా కదిలిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు రిజల్ట్స్ వెలువడ్డాక ర్యాలీ చేశాయి. 1.8 శాతం లాభంతో రూ.1,672 దగ్గర ముగిశాయి.