క్రెడిలాను అమ్మిన హెచ్​డీఎఫ్​సీ..రూ. 9,060 కోట్లకు కొన్న ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు

క్రెడిలాను అమ్మిన హెచ్​డీఎఫ్​సీ..రూ. 9,060 కోట్లకు కొన్న ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు

న్యూఢిల్లీ: హెచ్​డీఎఫ్​సీ క్రెడిలా ఫైనాన్షియల్​ సర్వీసెస్​లోని 90 శాతం వాటాను రూ. 9,060 కోట్లకు అమ్మేసినట్లు హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్​ ప్రకటించింది. క్రిస్​ క్యాపిటల్ సహా పలు ప్రైవేట్​ ఈక్విటీ కంపెనీలు ఈ వాటాను కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఎడ్యుకేషన్​ లోన్లు ఇవ్వడం కోసం క్రెడిలా ఫైనాన్షియల్​ సర్వీసెస్​ను హెచ్​డీఎఫ్​సీ ఏర్పాటు చేసింది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​తో విలీనానికి ముందుగానే హెచ్​డీఎఫ్​సీ ఈ అమ్మకాన్ని వెల్లడించింది. హెచ్​డీఎఫ్​సీ క్రెడిలాలో వాటా అమ్మడానికి డెఫినిటివ్​ ఎగ్రిమెంట్లు కుదుర్చుకున్నట్లు హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ క్రెడిలా ఫైనాన్షియల్​ సర్వీసెస్​ లిమిటెడ్​లు  ప్రకటించాయి. 

హెచ్​డీఎఫ్​సీ క్రెడిలా 2022–23 లో రూ. 1,352 కోట్ల రెవెన్యూ సాధించింది. మార్చి 2023 నాటికి ఈ కంపెనీ నెట్​వర్త్​ రూ. 2,435 కోట్లు. వాటా కొనుగోలు చేసిన  కొప్​వూర్న్​ బీ. వీ, మోస్​ ఇన్వెస్ట్​మెంట్స్​, డెఫాటి ఇన్వెస్ట్​మెంట్స్​ హోల్డింగ్​ బీ. వీ, ఇన్ఫినిటీ పార్ట్​నర్స్​.... ప్రైవేట్​ ఈక్విటీ కంపెనీ  క్రిస్​క్యాపిటల్​కి చెందినవేనని హెచ్​డీఎఫ్​సీ స్టాక్​ ఎక్స్చేంజీలకు పంపిన సమాచారంలో తెలిపింది. పై కన్సార్టియమ్​ హెచ్​డీఎఫ్​సీ క్రెడిలా ఫైనాన్షియల్​ సర్వీసెస్​ విలువను రూ. 10,350 కోట్లుగా లెక్కకట్టాయని, కొత్తగా రూ. 2,000 కోట్లను కంపెనీలో పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నాయని పేర్కొంది. హెచ్​డీఎఫ్​సీ క్రెడిలాలో 9.99 శాతం వాటాను మాత్రం హెచ్​డీఎఫ్​సీ అట్టేపెట్టుకుంటోంది. హయ్యర్​ ఎడ్యుకేషన్​తోపాటు, విదేశాలలో ఎడ్యుకేషన్​కూ ఈ కంపెనీ స్టూడెంట్లకు అప్పులు ఇస్తోంది. ఇప్పటిదాకా 1.24 లక్షల మంది కస్టమర్లకు మొత్తం రూ. 15 వేల కోట్లకు పైగా ఎడ్యుకేషన్​ లోన్లను క్రెడిలా ఇచ్చింది.