Fixed Deposits: ఖాతాదారులకు మూడు బ్యాంకులు షాక్.. డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపు..

Fixed Deposits: ఖాతాదారులకు మూడు బ్యాంకులు షాక్.. డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపు..

FD Rates Cut: రానున్న వారంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో వడ్డీ రేట్ల విషయంపై కీలక ప్రకటన ఉంటుందని ఇప్పటికే నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది ఆర్థిక వేత్తలు 25 బేసిస్ పాయింట్ల వరకు రెపో రేటు తగ్గింపు ఉండొచ్చని ఊహిస్తున్నారు. అయితే తాజాగా ట్రంప్ ప్రపంచ దేశాలపై కొత్త టారిఫ్స్ ప్రకటించిన వేళ రిజర్వు బ్యాంక్ ఎలాంటి ప్రకటనతో ముందుకొస్తుందనే ఆందోళన ప్రజల్లో కొనసాగుతోంది. 

ఈ క్రమంలోనే దేశంలోని కొన్ని బ్యాంకింగ్ సంస్థలు తాము ఆఫర్ చేస్తున్న టర్మ్ డిపాజిట్లు లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రానున్న ఎంపీసీ సమావేశానికి ముందుగానే వడ్డీ రేట్ల తగ్గింపులను తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యెస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంకులు ప్రకటించాయి. ఇవి సాధారణ ఇన్వెస్టర్లతో పాటు సీనియర్ సిటిజన్ ఇన్వెస్టర్లను సైతం ప్రభావితం చేస్తున్నాయి.

HDFC బ్యాంక్..
ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఖాతాదారులు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7.25 శాతం మధ్య కాలానుగుణంగా వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. 10 ఏళ్ల లోపు కాలానికి రూ.3 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై సాధారణ పెట్టుబడిదారులకు ఈ వడ్డీ రేట్లను అందుబాటులో ఉంచింది. 10 నెలల నుంచి 21 నెలల మధ్య కాలానికి చేసే పెట్టుబడులపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఇక సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 3 కోట్ల రూపాయల వరకు 10 ఏళ్ల లోపు కాలానికి చేసే పెట్టుబడులపై 3.5 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 10 నుంచి 21 నెలల కాలానికి గరిష్ఠ రేటును చెల్లిస్తోంది.

Also Read : 8.6 శాతం పెరిగిన యూబీఐ లోన్లు

Yes బ్యాంక్..
 ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన వాటిలో యెస్ బ్యాంక్ కూడా నిలిచింది. గతంలో ఆఫర్ చేసిన రేట్ల కంటే ప్రస్తుతం 25 బేసిస్ పాయింట్లు తక్కువ రేటును ప్రస్తుతం బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఈ క్రమంలో సాధారణ పెట్టుబడిదారులకు 3.25 శాతం నుంచి 7.75 శాతం వరకు డిపాజిట్లపై వడ్డీని ఆఫర్ చేస్తోంది. 12 నుంచి 24 నెలల కాలానికి చేసే డిపాజిట్లపై సాధారణ ఇన్వెస్టర్లకు 7.75 శాతం వరకు వడ్డీని చెల్లించాలని బ్యాంక్ నిర్ణయించింది. ఇదే క్రమంలో సీనియర్ సిటిజన్ కస్టమర్లకు సాధారణ ఖాతాదారుల కంటే 50 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీని అందుబాటులో ఉంచింది. 

Punjab & Sind బ్యాంక్..
ఇక చివరిగా వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంకుల జాబితాలో పంజాబ్ అండ్ సింథ్ కూడా చేరిపోయింది. ప్రస్తుతం బ్యాంక్ తన 333 రోజులు, 555 రోజుల డిపాజిట్లను ప్రజలకు ఆఫర్ చేయటం లేదు. అయితే 444 రోజుల కాలానికి చేసే డిపాజిట్లపై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.10 శాతంగా మార్చింది. అలాగే 777 రోజుల కాలానికి ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లను గతంలో ఉన్న 7.25 శాతం నుంచి ప్రస్తుతం 6.50 శాతానికి బ్యాంక్ తగ్గించింది. ఇక చివరిగా 999 రోజుల కాలానికి ఆఫర్ చేస్తున్న డిపాజిట్ రేట్లను గతంలో ఉన్న 6.65 శాతం నుంచి 6.35 శాతానికి బ్యాంక్ తగ్గించటం గమనార్హం. కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంకులు స్పష్టం చేశాయి.