ఎన్నో దేశాల పండ్లు  ఈడ పండిస్తున్నడు

ఎన్నో దేశాల పండ్లు  ఈడ పండిస్తున్నడు

వియత్నాం స్పెషల్​ జాక్​ ఫ్రూట్​. బ్రెజిల్​ బిరిబా, బ్లూ బెర్రీ. ఇండోనేసియా బ్లూ జావా బనానా,  పాలినేసియ ఐస్​లాండ్​లోని పొపౌలు బనానా.. ఇవే కాదు ఆస్ట్రేలియా, థాయి​లాండ్​, జపాన్ ఇలా మరెన్నో దేశాల్లో దొరికే అరుదైన పండ్లు. ఇవన్నీ రుచి చూడాలంటే కర్నాటకలోని లష్​ గ్రీన్​ ఫామ్​కి వెళ్తే చాలు. ఈ ఫామ్​లో అడుగుపెడితే వివిధ దేశాలకి చెందిన 1300 లకి పైగా పండ్లు, మసాలా దినుసులు, ఔషధ  మొక్కల్ని చూడొచ్చు. అంతేకాదు ఈ ఫామ్​ నడుపుతున్న రాజేంద్ర హిందూమనెని కలిస్తే  సాగు గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకోవచ్చు. కర్నాటకలోని సగర​ సిటీలో ఉంది ఈ ఫామ్. ఇందులో వివిధ ప్రాంతాలకి చెందిన మొక్కల్ని సాగుచేస్తున్న రాజేంద్ర కామర్స్​లో గ్రాడ్యుయేషన్​ చేశాడు. అతనికి చిన్నప్పట్నించీ మొక్కలంటే ఇష్టం. అందుకే మొక్కల పెంపకాన్నే వృత్తిగా మార్చుకున్నాడు. మొదట్లో అరికా నట్​, మామిడి, పనస,  జామతో పాటు  లవంగాలు, యాలకులు లాంటి మసాలా దినుసుల్ని సాగు చేసేవాడు . ఆ ప్రయాణంలోనే ప్రొఫెసర్​ సత్యనారాయణ్​ భట్​తో పరిచయం అయింది రాజేంద్రకి. చిన్నప్పట్నించీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకి చెందిన అరుదైన మొక్కల్ని సేకరించాలన్న ఆలోచన ఉండేది రాజేంద్రకి. అదే విషయాన్ని  ప్రొఫెసర్​తో చెప్తే ఎంకరేజ్​ చేశాడు. ప్లాంట్ కలెక్టర్​ మజ్జిగేసర సుబ్రహ్మణ్యం కూడా అండగా నిలిచాడు. చుట్టుపక్కలుండే మరికొందరు రైతులు  ప్రోత్సహించారు. అలా అందరి సపోర్ట్​తో పండ్ల మొక్కలతో పాటు, అంతగా ఎవరికీ తెలియని ఔషధ మొక్కల్ని సేకరించడం మొదలుపెట్టాడు.

కూతుళ్ల సాయంతో...
ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలోని అరుదైన  మొక్కలకి సంబంధించిన వివరాలు తెలుసుకుంటుంటాడు రాజేంద్ర.  కొన్నిసార్లు తానే అక్కడికెళ్లి , మరికొన్ని సార్లు తెలిసిన ప్లాంట్​ కలెక్టర్స్​ ద్వారా వాటిని సేకరిస్తాడు. అయితే  ఇది మాటల్లో చెప్పినంత తేలికైన పని కాదు అంటున్నాడు రాజేంద్ర. చాలాసార్లు చిన్న అంటుని కూడా వేల రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుందట. పైగా వాటి విత్తనాల్ని పాలీహౌస్​లో ఉంచి నెలలు తరబడి అబ్జర్వ్​ చేయాలి. ఇంత చేసినా  మన వాతావరణ పరిస్థితుల్లో ఇమడలేక కొన్ని మొక్కలు చచ్చిపోతుంటాయి.  అలా జరగకుండా చేయాలనే ప్రయత్నంలో ఎలా పెంచాలన్న దానిమీద చాలా స్టడీ చేశాడు రాజేంద్ర. సరికొత్త వ్యవసాయ పద్ధతుల్ని నేర్చుకుంటున్నాడు. దీనంతటికి అతని  కూతుళ్లు మేఘ, గగన కూడా సాయం చేస్తున్నారు.

పచ్చళ్లు అమ్ముతున్నాడు
రాజేంద్ర ఇద్దరు కూతుళ్లు  వివిధ ప్రాంతాల మొక్కల బొటానికల్​, లోకల్​ పేర్లు, అవి ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయి, పువ్వు, కాయల సీజన్​, వాటి మెడిసినల్​ ప్రాపర్టీలు​ , ప్రత్యేకతల గురించి డేటాబేస్​ తయారుచేస్తారు. ప్రస్తుతం వీళ్ల ఫామ్​లో,  ఇతర దేశాల పండ్లతో పాటు  మామిడి, అరటి, సీతాఫలం, అవకాడో, చెర్రీ, రామ్​భూటాన్​ ​ లాంటి పండ్ల  మొక్కలు ఉన్నాయి. అలాగే కాఫీ, కోకో, దాల్చిన చెక్క, వెనీలా, మిరియాలు, పసుపు, లవంగాలు, కరక్కాయ లాంటి కమర్షియల్​ పంటలు సాగు చేస్తున్నాడు రాజేంద్ర. తన ఫామ్​లో కాసే మామిడితో పచ్చళ్లు, పనసతో చిప్స్​ తయారుచేసి అమ్ముతున్నాడు కూడా. ముఖ్యంగా మల్నాడు ఫేమస్​ అప్పిమిడి మామిడితో పెట్టే పచ్చడి బాగా సేల్ అవుతుందని చెప్తున్నాడు రాజేంద్ర. అలాగే సాగుకి అవసరమయ్యే కరెంట్​ని సోలార్​ పద్ధతిలో తయారుచేస్తున్నాడు. వర్షపు నీటిని హార్వెస్ట్​ చేసి మొక్కలకి పెడుతున్నాడు. ఇందుకుగానూ ఎన్నో నేషనల్​, ఇంటర్నేషనల్​ అవార్డులు అందుకున్నాడు రాజేంద్ర. వానాకాలం నులిపురుగులు , ఫంగస్​ పెద్ద మొత్తంలో మొక్కలపై చేరతాయి. పండ్లు కాపుకి రాగానే కాండం తొలిచే పురుగులు, ఈగలు పెరుగుతుంటాయి. పైగా ఫామ్​ చుట్టు పక్కల అడవి ఉండటం వల్ల కోతులు, ఉడతలు, అడవి దున్నల బెడద ఉంటుంది. వీటన్నింటి నుంచి మొక్కల్ని, కాపుని కాపాడుకోవడంపెద్ద ఛాలెంజ్​ మాకు. అయినా సరే ఏ రోజూ ఇబ్బంది అనిపించలేదు. ఫామ్​లో​ విత్తనం మొలకెత్తినా, దానికి పువ్వు పూసినా, కాయ కాసినా.. ఆ సంతోషం  ముందు ఈ సమస్యలన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. ప్రపంచంలో  ఉన్న అన్నిరకాల అరుదైన మొక్కల్ని  ఫామ్​లో పెంచాలన్నదే నా కోరిక అంటున్నాడు రాజేంద్ర.