నేను పాడుతున్నది మీ చప్పట్ల కోసం కాదు, మీ పొగడ్తల కోసమూ కాదు. నా నేల విముక్తి కోసం’ అని ఉరికంబం ఎక్కే ముందు పలికాడు ‘విక్టర్ జారా’ అనే చిలీ దేశపు కవి. మన తెలుగు సమాజంలో ప్రజల కష్టాలకు కన్నీళ్లకు స్పందించే రచయితల్లో ముందు వరుసలో ఉండే పేరు బండి నారాయణ స్వామి.
రాయలసీమ ప్రాంత సాహిత్యకారుల్లో ముఖ్యులు స్వామి. తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం కథా యుగం నడుస్తున్నది. ఆ కథకు పెద్ద పీటను వేసింది సీమ నేల. జీవితాన్ని ఆలోచింపజేయడంలో కథ పోషించే పాత్ర కీలకమైంది. స్పందనతోనూ, ఎమోషన్స్తోనూ కవిత్వం పుట్టుకొస్తుంది. కథ అలా కాదు చరిత్రను, మనిషిని, సంస్కృతిని కలగలిపి చిత్రించి చూపించే వీలు కథలో ఎక్కువగా ఉంటుంది. అలా గొప్ప కథలు రాసిన రాయలసీమ కథకుల్లో బండి నారాయణ స్వామిది పైచేయి. ఆయన రాసిన నవలలు కూడా దేనికదే గొప్పది. మిగిలిన రచయితల కంటే స్వామిలో ఉన్న దృష్టి కోణం ఆయన్ని ఉన్నత శిఖరాలకు నడిపించింది. ఏ రచయితకైనా సమాజమే వస్తువు. ఆ సమాజపు వర్తమానాన్ని చూసేవారు కొందరైతే, సమాజపు లోతుల్లోకి, చరిత్రల్లోకి చూసేవారు మరికొందరు. స్వామి ఈ రెండో కేటగిరీకి చెందినవారని చెప్పాలి. రాయలసీమ కరువు మీద, కన్నీళ్ల మీద ఎన్నో రచనలు వచ్చాయి. వాటిలో స్వామి రచనలు ప్రత్యేకంగా నిలబడడానికి ఈ కోణమే కారణం.
రాయలసీమను స్వామి అర్థం చేసుకున్న తీరు వేరేగా ఉంటుంది. ఒక తాత్వికునిగా, చరిత్రకారునిగా అక్కడి ప్రజల అసలు జీవితాల్ని పట్టుకున్నారు స్వామి. ఈవాళ్టి స్థితికి కారణమైన చారిత్రక పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. విముక్తి మార్గం గురించి ఆలోచించాడు. ఆ క్రమంలో ఆధిపత్యాలను ధిక్కరించాడు. స్వామి రచనల్లో, ఆలోచనా ధోరణిలో ఈ రకమైన చైతన్యం కనిపిస్తుంది. ఆయన రాసిన నలభై కథల్లో మనకు సజీవ చిత్రణ కనిపిస్తది. ‘వీరగల్లు’ కథలు అందుకే తెలుగు కథా సాహిత్యంలో ప్రత్యేకత సంతరించుకున్నాయి.
రాయలసీమ ప్రజల కష్టాలకు కారణాలను కేవలం వర్తమానం నుంచి ఆలోచిస్తే అర్థం కావు. శతాబ్దాల చరిత్రలోకి వెళితే మనకు శ్రీకృష్ణదేవ రాయలు కనిపిస్తాడు. ఆనాడు రత్నాలు రాసులు పోసిన చరిత్ర ఆ తరువాత ఎలా కనుమరుగయ్యిందో మనకు స్వామి రచనలు చూపిస్తాయి. ఈ నేపథ్యంతో రాసిందే ‘శప్త భూమి’ నవల. ఈ నవల కంటే ముందు… ‘గద్దలాడుతండాయి’, ‘మీ రాజ్యం మీరేలండి’, ‘రెండు కలల దేశం’ వంటి నవలలు రచించి, ఆలోచనకు మంచి ముడిసరుకు అందించాడు. ఈ రచనల వెనుక స్వామికి బలమైన ఆవేదన ఉంది. కురబ సామాజిక వర్గంలో పుట్టిన స్వామి తన జీవితాన్నే సాహిత్య వస్తువుగా స్వీకరించాడు. తన రచనకు, ఆచరణకు ఎక్కడా తేడా ఉండదు. తాను ఏమి మాట్లాడతాడో, అదే రాస్తాడు, ఏది రాస్తాడో అదే ఆచరిస్తాడు. బహుజనుల మట్టి జీవితాలు స్వామి రచనల్లో ప్రాణం పోసుకొని మనకు దర్శనమిస్తాయి.
ప్రాంతీయ చైతన్యం గడిచిన రెండు దశాబ్దాల్లో ఎల్లలు దాటి విస్తరించింది. ఈ రకమైన చైతన్యంతో తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయల సీమల నుండి విస్తృత సాహిత్యం వచ్చింది. సీమ నుండి వచ్చిన సాహిత్యంలో మరిచిపోలేని పేరు బండి నారాయణ స్వామి. దేశంలోకి కమ్యూనిస్టు పార్టీ వచ్చి వందేళ్లు కావస్తున్నది. విప్లవం రాకపోగా, కమ్యూనిస్టు పార్టీల్లోని పెద్ద కులాలవారి నాయకత్వం బహుజనులను ఏ మాత్రం ఎదగకుండా అడ్డు పడింది. ఆ దుర్మార్గం ఏ బహుజన మేధావినైనా, రచయితనైనా కుదరుగా ఉండనివ్వదు. చరిత్రలోకి తొంగి చూసేలా చేస్తుంది. అలా చూసుకున్నప్పుడు బహుజన జీవితం మరింత పెద్దగా కనిపిస్తుంది. సంపద సృష్టికర్తలైన బహుజనుల జీవితాలు అభివృద్ధికి ఎందుకు దూరంగా ఉంటున్నాయో ఆలోచించేలా చేస్తుంది. ఈ ధోరణిలో ఆయన సీమ కష్టాలకు, కన్నీళ్లకు మూలాలను వెతుక్కుంటూ క్రీ.శ. 18వ శతాబ్దం వరకు ప్రయాణం చేశాడు. అక్కడి నుండి చరిత్ర ఎన్ని మలుపులు తిరిగిందో తెలుపుతూ నవలల్లో దాన్ని చూపించే పని చేశాడు. అలా చారిత్రక నవలగా ముందుకు వచ్చిందే ‘శప్తభూమి’. అందుకే, ‘శప్తభూమి’లో స్వామి ప్రతీ ఆచార వ్యవహారాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రించారు. బలహీనుల మీద బలవంతులు సంప్రదాయాల పేరుతో, ఆచార వ్యవహారాల పేరుతో ఆధిపత్యం నెరిపే తీరును చారిత్రిక కోణంలో అద్భుతంగా చూపించారు. ఆచారాలు పెద్ద కులాలకు ఆటవిడుపులా తోస్తే, కింది కులాలకు మాత్రం గుదిబండలా మారుతాయి. ఈ వైరుధ్యాన్ని ‘శప్తభూమి’లో స్వామి గొప్పగా చిత్రించి పాఠకులను కట్టిపడేశారు. ఖండాలు దాటి స్వామి కలం విస్తరించేలా చేసింది ‘శప్తభూమి’. గత యేడాది ‘ఆటా’ నవలల పోటీలో మొదటి బహుమతిగా రెండు లక్షల రూపాయలు గెలుచుకుంది.
అట్టడుగు కులాల నుండి సాహిత్యకారులుగా ఎదగడమే ఒక సాహసం. తమ రచనలతో అవార్డులు, అంతర్జాతీయ గుర్తింపులు సాధించడం అంత మామూలు విషయమేమీ కాదు. ఈ ఈ ఘనత స్వామి సాధించారంటే… అక్షరాల్లో ఉన్న సజీవ జీవితం కారణం. ఆయన రచనలు చదువుతుంటే… మన పక్కన కూర్చొని చెప్తున్నారా? అనిపిస్తుంది. ఆచరణలో సైతం బహుజన కులాలకు బాసటగా నిలబడతాడు స్వామి. అలాగే ప్రాంతాలపరంగా దగాపడ్డ నేలలకు తన వంతు మద్ధతు ప్రకటించాడు. తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్ర నుండి సపోర్ట్ చేసినవారిలో బండి నారాయణ స్వామి కూడా ఉన్నారు. బహుజన రచనలంటే చిన్న చూపు చూసేవారిని ‘మా అక్షరాలు ఎవరికంటే తక్కువ కాద’నే ధిక్కారాన్ని ‘శప్తభూమి’తో చాటి చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్ర నుండి సపోర్ట్ చేసిన వారిలో స్వామి కూడా ఉన్నారు. తనలో ఉన్న ప్రజాస్వామిక దృక్పథానికి ఈ మద్ధతు ఒక నిదర్శనం.
‘శప్తభూమి అంటే శపించబడింద’ని అర్థం. ‘శప్తభూమి’ నవల ఈ యేడాది కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైందంటే కారణం ఈ చారిత్రిక మూలాలను చూపించడమే. చారిత్రక గ్రంథాలు చరిత్రను మాత్రమే చెప్తాయి. కానీ, సాహిత్యం ఆ కాలంలో జీవించిన ప్రజల చరిత్రను పట్టి చూపుతాయి. ఈ నేపథ్యంలో స్వామి ‘శప్తభూమి’ నవలలో సీమ ప్రజల జీవితాన్ని పాత్రలుగా మలచి పాఠకుల ఎదుట నిలిపారు.
– డా.పసునూరి రవీందర్, కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కార గ్రహీత