బెల్లంపల్లి, వెలుగు: అబద్దపు హామీలు ఇచ్చి, రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఈసారి గుడ్బయ్ చెప్తారని మాజీ మంత్రి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గడ్డం వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పాలన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ గతేడాది చేపట్టిన భారత్ జూడో యాత్ర ముగిసి ఏడాది కావస్తున్న సందర్భంగా బుధవారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో వినోద్ కుమార్ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బెల్లంపల్లి నియోజకవర్గానికి, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు.
రాష్ట్రంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయిందని, కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ ఓటమి తథ్యమన్నారు. ఈ యాత్రలో పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాంచందర్, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భారత్ జోడో యాత్ర చారిత్రక ఘట్టం
ఆదిలాబాద్ టౌన్: భారత్ జూడో యాత్ర ఓ చారిత్రక ఘట్టమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, విభజన రాజకీయాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, చైనా దురాక్రమణలకు వ్యతిరేకంగా భారతదేశాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా తమ నాయకుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి, భరత్, నగేశ్, చరణ్ గౌడ్, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ భారీ ర్యాలీ
మంచిర్యాల: రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర ముగిసి ఏడాది అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మంచిర్యాలలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం డీసీసీ అధ్యక్షురాలు కె.సురేఖ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ప్రజలకు తీరని అన్యాయం
భైంసా: బీఆర్ఎస్ సర్కారును ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ నేత డా.కిరణ్కుమార్అన్నారు. భారత్ జోడో యాత్ర ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం భైంసాలో సంబురాలు చేసుకున్నారు. సీనియర్ లీడర్ఆనంద్రావు పటేల్, నాయకులు, కార్యకర్తలు కలిసి ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్హయాంలో దేశంలోనే కాకుండా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలయ్యాయన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీతో పాటు, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. లీడర్లు షేక్ అంజద్, హైమద్ తదితరులు పాల్గొన్నారు.