- నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో ఘటన
- నిందితుడి ఇంటికి నిప్పంటించే యత్నం
బాల్కొండ, వెలుగు : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో సోమవారం ఓ వ్యక్తి తన స్నేహితుడిని మర్డర్ చేశాడు. మోర్తాడ్ కు చెందిన చెప్పాల రాకేశ్(24), తెడ్డు సూర్య స్నేహితులు. రాకేశ్హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్. ఇతడికి ఇంకా పెండ్లి కాలేదు. బతుకు దెరువు కోసం గల్ఫ్ వెళ్లిన సూర్య తన స్నేహితుడైన రాకేశ్‌ను నమ్మి ఇంటి బాగోగులు చూసుకోవాలని చెప్పాడు. అయితే రాకేశ్..సూర్య భార్యతో వివాహతేర సంబంధం పెట్టుకున్నాడు. గల్ఫ్ లో ఉన్న సూర్య విషయం తెలుసుకుని ఇటీవల మోర్తాడ్ వచ్చాడు. భార్య మొబైల్ చెక్ చేయడంతో పాటు పలువురిని ఎంక్వైరీ చేసి నిజమేనని నిర్ధారణకు వచ్చాడు. సోమవారం ఉదయం రాకేశ్ ఇంటికి వెళ్లిన సూర్య అతడితో మాట్లాడాలని చెప్పి కత్తితో కడుపు, ఛాతిలో పొడిచి చంపాడు. తర్వాత భార్య, తల్లితో కలిసి పరారయ్యాడు. దీంతో మృతుడి బంధువులు సూర్య ఇంటికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు నిందితుడికి శిక్షపడేలా చూస్తామని చెప్పినా వినలేదు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరికి భీమ్ గల్ సీఐ వెంకటేశ్వర్లు వచ్చి ఆందోళనాకారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.
మెదక్‌లో ఆస్తి తగాదాలతో మేనమామను చంపిండు
మెదక్ : ఆస్తి విషయంలో జరిగిన గొడవలో మేనల్లుడు మేనమామను హత్య చేశాడు. మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్ కథనం ప్రకారం... సిద్దేశ్గారి ప్రభాకర్(42) సోదరి యశోద రాంనగర్ లో ఉంటోంది. ప్రభాకర్ రెండో భార్య విజయ పది నెలలుగా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి లోని తల్లిగారింటి వద్ద ఉంటోంది. ప్రభాకర్‌కు, యశోదకు మధ్య తరచూ ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ప్రభాకర్ మద్యం తాగి యశోదతో గొడవ పడ్డాడు. దీంతో యశోద కొడుకు ఏసుప్రభు ఆవేశానికి లోనై కత్తితో మేనమామ ప్రభాకర్ గొంతు కోసి చంపాడు. యశోద, ఏసుప్రభులను అదుపులోకి తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
గోదావరిఖనిలో పని చేసిన పైసలడిగినందుకు ఖతం
గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆదివారం అర్ధరాత్రి డబ్బులడిగినందుకు ఓ మేస్త్రీ తన దగ్గర పనిచేసే మేషన్ కార్మికుడిని చంపేశాడు. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం...ఏపీలోని తిరుపతికి చెందిన చొడిగ రవితేజ గోదావరిఖనికి వచ్చి మేస్త్రీ పనిచేస్తున్నాడు. ఇతని దగ్గర పనిచేయడానికి ఏపీలోని తాడేపల్లిగూడానికి చెందిన వనచర్ల గంగాధర్‌రావు (36) మూడు నెలల క్రితం వచ్చాడు. ఇటీవల ఓ ఇంటిని నిర్మించగా వచ్చిన డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తనకు డబ్బులివ్వాల్సిందేనని గంగాధర్‌రావు పట్టుబట్టాడు. ఆదివారం కూడా ఇదే విషయమై లొల్లి పెట్టుకున్నారు. అయితే, రాత్రి పవర్‌హౌస్‌కాలనీలో న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో కూడా గంగాధర్‌రావు డబ్బులు అడగడంతో రవితేజ పక్కనే ఉన్న ఇనుప రాడ్‌తో తలపై కొట్టాడు. గాయపడ్డ అతడిని స్థానికులు హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా చనిపోయాడు. సీఐ ప్రమోద్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.