అతడే భారత క్రికెట్ భవిష్యత్: వసీం అక్రమ్

అతడే భారత క్రికెట్ భవిష్యత్: వసీం అక్రమ్

భారత యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌పై పాక్‌ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. భవిష్యత్తులో రుతురాజ్ టీమిండియాకు విలువైన ఆస్తిగా మారతాడని వెల్లడించాడు. 'ఒక ఆటగాడిగా ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండటమే కాదు.. ఒత్తిడిలోనూ రాణించగలగాలి. రుతురాజ్ అదే చేసి చూపించాడు. ఈ ఐపీఎల్‌లో అతని నుంచి మనం అద్భుతమైన క్యాచ్‌లు, ఫీల్డింగ్‌ చూశాం. ఇవన్నీ చూశాక అతనికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పగలను. రాబోవు రోజుల్లో అతడు భారత జట్టుకు కీలక ప్లేయర్‌గా మారతాడు.." అని అక్రమ్‌ తెలిపాడు.    

ఈ సీజన్‌లో రుతురాజ్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. మరో ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్ పై భారీ ఇన్నింగ్స్ ఆడిన అతడు.. 50 బంతుల్లో 92 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సీజన్‌లో 16 మ్యాచుల్లో 590 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇదిలావుంటే గతేడాది భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రుతురాజ్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఇప్పటివరకు 10 టీ20లు ఆడగా..161 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 57 పరుగులు మాత్రమే. ఇక ఒకే ఒక్క వన్డే మ్యాచ్‌ ఆడగా.. అందులో 19 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రిజర్వ్ ఓపెనర్‌గా  డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచుకు ఎంపికైనప్పటికీ జూన్ 3వ తేదీన వివాహం ఉండటంతో ఆడలేకపోతున్నాడు. జూన్ 2, 3 తేదీలలో అతని వివాహం జరగనుంది.