గతకొన్ని రోజుల క్రితం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈడీ, ఐటీ రైడ్స్ పై స్వయంగా ఆయన స్పందించారు. కుల గణన, స్థానిక సంస్థల ఎన్నికలు, ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రభుత్వం విధానాలను వివరించారు. కేటీఆర్ ప్రజల కోసం పాదయాత్ర చేస్తే.. బాగుంటుందని మంత్రి పొంగులేటి ఆయనకు సూచించారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో జరిగే మార్పులు, చేర్పుల గురించి ఆయా పార్టీల నేతలు మాట్లాడుకోవాలని అన్నారు. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి పదవికాలంపై లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని.. ఇంకా 4 సంవత్సరాల ఒక నెల వరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖరాఖండిగా చెప్పారు.
ఆయన ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు చేసిన అధికారులను వివరాలు వెల్లడించాలని మంత్రి కోరారు. బీఆర్ఎస్ పార్టీకి దోస్త్.. బీజేపీ పార్టీని అడిగి ఆయన ఇంట్లో జరిగిన ఈడీ రైడ్స్ డేటా తీసుకొచ్చి విడుదల చేసుకోవచ్చని బిఆర్ఎస్‌కు సూచించారు పొంగులేటి శ్రీనివాస్. పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ ప్రజల దగ్గరకి పోకుండా.. ఇప్పుడు అధికారం కోసం పాదయాత్ర చేస్తున్నారని మంత్రి అన్నారు. ప్రజల కోసం పాదయాత్ర చేస్తే బాగుంటుందని మంత్రి పొంగులేటి కేటీఆర్ కు సూచించారు. కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రులను టార్గెట్ చేయడం కోసం పాదయాత్ర చేస్తే.. కేటిఆర్ తెలివి తక్కువతనం అవుతుందని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు.. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 5 లక్షల ఇళ్లు నిర్మిస్తామని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సంక్రాంతిలోగా పూర్తి అవుతాయని ఆయన స్పష్టం చేశారు.