ఆస్తి కోసం సొంత తమ్ముడిని చంపేసిన అన్న

ఆస్తి కోసం సొంత తమ్ముడిని చంపేసిన అన్న

లక్ష్మణచాంద, వెలుగు: నిర్మల్ జిల్లాలో ఆస్తి కోసం సొంత తమ్ముడిని చంపేశాడో అన్న. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ గంగారెడ్డి సోమవారం నిర్మల్​లో మీడియాకు వెల్లడించారు. లక్ష్మణచాంద మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన సిలారి పెద్ద మల్లయ్య, చిన్న మల్లయ్య అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య కొన్నేండ్లుగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దమనుషులు పంచాయితీ పెట్టి సర్దిచెప్పినా రాజీ కుదరలేదు. ఈ క్రమంలో తమ్ముడిపై కోపం పెంచుకున్న పెద్ద మల్లయ్య ఇల్లు, పొలం కోసం తమ్ముడిని చంపాలని కొడుకుతో కలిసి స్కెచ్​వేశాడు.

గతనెల 29న ఉదయం చిన్న మల్లయ్య, పెద్ద మల్లయ్య భార్యలు గొడవ పడ్డారు. అదే అదునుగా పెద్దమల్లయ్య, అతని కొడుకు చిన్న మల్లయ్యను చంపాలని కత్తి, ఇనుప రాడ్డు తీసుకుని బయలుదేరారు. ఊరి సెంటర్​లో ఉన్న చిన్న మల్లయ్యపై విచక్షణా రహితంగా దాడిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాధితుడిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి  మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్​తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండుకు పంపినట్లు డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు.