వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసిన నాటి నుంచి భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. హిట్‌మ్యాన్ టీ20ల నుంచి తప్పుకున్నాడని కొందరు.. కాదు కాదు వన్డే ఫార్మట్‌కు సైతం గుడ్ బై చెప్పేశాడని మరికొందరు వాదిస్తున్నారు. అందుకు అతని ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నారు. రోహిత్ లావుగా ఉన్నాడని, తగినంత ఫిట్‌గా లేడని విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో భారత జట్టు స్ట్రెంగ్త్ అండ్ కండిషన్ కోచ్ అంకిత్ కలియార్ స్పందించారు.
రోహిత్ శర్మ యో-యో టెస్టులో ఉత్తీర్ణత సాధించలేదని వస్తున్న వార్తలను కొట్టిపారేసిన అంకిత్ కలియర్.. హిట్‌మ్యాన్ కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ ఫిట్‌నెస్‌లో మొనగాడని వెల్లడించారు. అతడు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంత ఫిట్‌గా ఉన్నారని కుండబద్ధలు కొట్టారు.
"రోహిత్ శర్మ ఫిట్ ప్లేయర్. మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. అతను కొంచెం బొద్దుగా కనిపిస్తుండొచ్చు.. కానీ అతను యో-యో టెస్ట్ లో ఎప్పుడూ ఉత్తీర్ణత సాధిస్తాడు. అతని చురుకుదనాన్ని మేము మైదానంలో కళ్లారా చూశాము. ఫిటెస్ట్ క్రికెటర్లలో ఒకరైన విరాట్ కోహ్లిలా రోహిత్ కూడా ఫిట్‌గా ఉన్నాడు.." అని అంకిత్ కలియార్ ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడారు.
కోహ్లీనే పరిచయం చేశారు
విరాట్ కోహ్లీ భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఫిట్‌నెస్ సంస్కృతిని ప్రవేశపెట్టారని తెలిపిన కలియార్.. అతను తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం వల్లే ప్రస్తుత భారత జట్టులోని చాలా మంది క్రికెటర్లు చాలా ఫిట్‌గా ఉన్నారని పేర్కొన్నారు.
"ఫిట్‌నెస్ విషయంలో అందరికీ విరాట్ ఒక ముఖ్య ఉదాహరణ. అతను జట్టులో ఫిట్‌నెస్ సంస్కృతిని సృష్టించాడు.జట్టులోని టాప్ ప్లేయర్ ఫిట్‌గా ఉన్నప్పుడు.. మిగిలిన వారు అతన్ని ఆదర్శంగా తీసుకుంటారు. అతను ఇతర ఆటగాళ్లలో కూడా ఆ విశ్వాసాన్ని నింపాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు అందరూ ఫిట్‌గా ఉండేలా చూసుకున్నాడు. జట్టులో ఫిట్‌నెస్ అతనికి అతి ముఖ్యమైన పాయింట్. ఆ సంస్కృతిని, క్రమశిక్షణను జట్టులో సృష్టించాడు. ఇది మెచ్చుకోదగ్గ విషయం. భారత ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉండడానికి అతనే కారణం.." అంకిత్ కడియార్ చెప్పుకొచ్చారు.
ఇద్దరికీ విశ్రాంతి
ప్రస్తుతానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ తో బరిలోకి దిగన్నారు.