T20 World Cup 2024: కోహ్లీ తదుపరి 3 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు చేస్తాడు: శివమ్ దూబే

T20 World Cup 2024: కోహ్లీ తదుపరి 3 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు చేస్తాడు: శివమ్ దూబే

ఐపీఎల్ 2024లో అద్భుత ఫామ్‌ కనపరిచిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ టోర్నీలో మాత్రం తేలిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో మొత్తంగా 5 పరుగులు చేశాడు. ఇందులో పాకిస్తాన్‌పై చేసిన 4 పరుగులే అత్యధికం. దీంతో కోహ్లి.. రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలా..? వద్దా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఆల్ రౌండర్ శివమ్ దూబే.. విరాట్‌కు మద్దతు పలికాడు. 

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లీ 15 మ్యాచ్‌ల్లో 741 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్‌ అతని సొంతమైంది. దీంతో రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను పక్కనపెట్టి రోహిత్, కోహ్లీల ఓపెనింగ్ కాంబినేషన్‌తో మేనేజ్‌మెంట్ ముందుకు సాగింది. అయితే, మెగా టోర్నీలో కోహ్లీ ఇంకా రెండంకెల స్కోరు నమోదు చేయలేదు. ఆడిన 3 మ్యాచ్‌ల్లో మొత్తంగా 5 పరుగులు చేశాడు. మూడు ఇన్నింగ్స్‌లలో 1, 4, 0 స్కోర్లు సాధించాడు. అందునా, న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ చాలా గమ్మత్తైనదని, అగ్రశ్రేణి బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారనే వాదనలూ ఉన్నాయి.

3 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు!

ఇర్లాండ్‌తో మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడిన దుబే, కోహ్లీ ఫామ్ గురించి ఆందోళన అనవసరమని పేర్కొన్నాడు. "కోహ్లి గురించి మాట్లాడటానికి నేనెవరు? అతను మూడు మ్యాచ్‌ల్లో పరుగులు చేయకపోతే, రాబోయే మూడు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు చేస్తారేమో.. అతని ఆట, అతను ఎలా ఆడతాడో మనందరికీ తెలుసు. జట్టుకు అవసరమైనప్పుడు రాణిస్తారనే నమ్మకం ఉంది.." అని విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు. చూడాలి మరి కోహ్లీ.. దూబే మాట నిబెడతాడో.. లేదో. 

భారత జట్టు తదుపరి శ‌నివారం(జూన్ 15) త‌మ ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో కెన‌డాతో తలపడనుంది. ఇందులో విజ‌యం సాధిస్తే టీమిండియా టేబుల్ టాప‌ర్‌గా గ్రూప్ ద‌శ‌ను ముగిస్తుంది.