- నెక్కొండలో పొడుగు కత్తి..
- అమెజాన్‌లో పొట్టి కత్తి కొన్న నిందితుడు
- ప్రేమించిన అమ్మాయిని దక్కకుండా చేశారనే కక్షతోనే..
- వడ్డేపల్లి పింగిళి జంక్షన్ వద్ద అరెస్టు
నర్సంపేట, వెలుగు: ప్రేమించిన అమ్మాయిని తనకు దూరం చేశారని కక్షతోనే ప్రేమోన్మాది మేకల నాగరాజు దీపిక ఫ్యామిలీని ప్లాన్ చేసి అంతం చేశాడని వరంగల్ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ తెలిపారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం16 చింతల్‌తండాలో బానోతు శ్రీనివాస్, బానోతు సుగుణలను గురువారం హత్య చేయగా ఆ వివరాలను నర్సంపేట టౌన్ పీఎస్‌లో డీసీపీ రవీందర్ వెల్లడించారు. మేకల నాగరాజు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగలో ఆటో డ్రైవర్. చెన్నారావుపేట మండలం 16 చింతలతండాకు చెందిన బానోతు దీపికతో ఐదేండ్ల కింద పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
దీపిక వడ్డేపల్లి పింగిళి కాలేజీకి వెళ్లే టైంలో నాగరాజు అక్కడే రూం తీసుకుని పెయింటింగ్ పనులు చేశాడు. 2023 అక్టోబర్‌లో హైదరాబాద్ వెళ్లిన దీపిక, నాగరాజు నవంబర్‌లో పెండ్లి చేసుకున్నారు. దీంతో దీపిక తల్లిదండ్రులు సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా ఇద్దరినీ పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వగా.. దీపిక నాగరాజుతోనే వెళ్లిపోయింది. కొంతకాలం హైదరాబాద్‌లోనే ఉండగా వీరి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. దీంతో నాగరాజుతో ఉండలేనని దీపిక తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఉంటోంది. దీపిక తన వద్దకు రాకపోవడానికి ఆమె తల్లిదండ్రులే కారణమని భావించిన నాగరాజు వారిని చంపాలని అనుకున్నాడు. హైదరాబాద్‌నుంచి ఐదు నెలల కింద గుండెంగ గ్రామానికి వచ్చి ఆటో నడుపుకుంటున్నాడు.
వేచి చూసి వేటేశాడు..
దీపిక ఫ్యామిలీని మర్డర్ చేయాలనుకున్న నాగరాజు నెక్కొండలోని అంబేద్కర్ సెంటర్లో పొడవాటి కత్తి కొన్నాడు. అమెజాన్‌లో పొట్టి కత్తి కొనుగోలు చేశాడు. చాలాసార్లు 16 చింతలతండాకు వెళ్లి దీపిక ఇంటి దగ్గర రెక్కీ చేశాడు. ఈనెల 11 అర్ధరాత్రి దాటాక ఆరుబయట నిద్రిస్తున్న దీపికను కత్తితో నరకబోగా చేతులు అడ్డుపెట్టింది. ఇది చూసి మంచంపై నుంచి లేచిన దీపిక తల్లిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె చనిపోయింది. మరో మంచంపై ఉన్న దీపిక తండ్రి శ్రీనివాస్‌పై కూడా దాడి చేశాడు.
తర్వాత దీపిక తమ్ముడిపై అటాక్ చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న శ్రీనివాస్‌ను నర్సంపేటకు తరలిస్తుండగా చనిపోయాడు. ఇంతలోనే తండా వాసులు కేకలు వేయడంతో శ్రీనివాస్ పారిపోయాడు. నిందితుడిని వడ్డేపల్లి పింగిళి జంక్షన్ వద్ద గురువారం రాత్రి పట్టుకున్నట్లు డీసీపీ రవీందర్ తెలిపారు. నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్, నెక్కొండ ఎస్సై చంద్రమోహన్, ఎస్సై అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.