తండ్రి కొడితే పిల్లలు తిరగబడతారు. లేదంటే.. ఇంట్లో నుంచి పారిపోయి కడుపు మాడినప్పుడు ఇంటికి తిరిగొస్తారు. తండ్రి కొట్టాడని ఇంటి నుంచి పారిపోయిన ఈ దోసె కింగ్ మాత్రం కోట్లకు అధిపతి అయ్యాడు. వేల మందికి ఉపాధిని ఇస్తున్నాడు. ఒకప్పుడు హోటల్‌లో అంట్లు తోమిన వ్యక్తే ఇప్పుడు వందకు పైగా హోటళ్లకు ఓనర్. ఏడాదికి 300 కోట్లకు మించి సంపాదిస్తున్న జయరాం గురించి...
జయరాం బనన్ది కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ఉడిపిలో ఒక మధ్య తరగతి కుటుంబం. తండ్రి డ్రైవర్. ఆయనకు కాస్త కోపం ఎక్కువ. తండ్రి అంటే జయరాంకి చిన్నప్పటి నుంచి చాలా భయం. అందుకు కారణం జయరాం స్కూల్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యేవాడు. ఫెయిల్ అయిన ప్రతిసారి తండ్రి కొట్టేవాడు. చాలాసార్లు కళ్లలో కారం పొడి పోసేవాడు. కొడుకు బాగా చదవడం లేదన్న కోపంతో ఆయన అంత కఠినంగా ఉంటుంటే... అది కాస్తా ఆ తండ్రీకొడుకుల మధ్య భయమనే అడ్డుగోడను కట్టింది. పదమూడేండ్ల వయసులో జయరాం పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. దాంతో ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి పర్సులో నుంచి డబ్బు దొంగతనం చేసి ముంబైకి పారిపోయాడు. ఇదంతా1967 నాటి సంగతి.
బస్‌లో ముంబైకి
ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాక ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు జయరాంకి. బస్టాండ్‌లోకి వెళ్లి ముంబై వెళ్లే బస్సులో కూర్చున్నాడు. చేతిలో డబ్బుతో టికెట్‌కొని ముంబై చేరుకున్నాడు. అక్కడికయితే వెళ్లాడు కానీ.. అక్కడ ఎవరూ తెలియదు. ఏం చేయాలో తోచలేదు. బస్టాప్‌లోనే ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ సమయానికి అక్కడే ఉన్న వాళ్ల ఊరి అతను ఒకతను జయరాంని చూశాడు. అతను జయరాంని నవీ ముంబై.. పన్వెల్‌లోని ‘హిందుస్తాన్ ఆర్గానిక్ కెమికల్స్’(హెచ్‌ఓసీ) క్యాంటిన్‌కు తీసుకెళ్లి, అక్కడ గిన్నెలు కడిగే పనిలో పెట్టాడు. అప్పట్లో జయరాం జీతం18 రూపాయలు మాత్రమే. జయరాం క్యాంటిన్‌లో కష్టపడి పనిచేసేవాడు. అతని పని నచ్చిన క్యాంటిన్‌వాళ్లు అతన్ని క్లీనింగ్‌సెక్షన్‌నుంచి కుకింగ్ టేబుల్‌కి మార్చారు. ఆ తర్వాత వెయిటర్‌గా కొన్నాళ్లు పనిచేశాడు. చాలా తక్కువ టైంలోనే హెడ్‌వెయిటర్‌గా ప్రమోషన్ వచ్చింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఎనిమిదేండ్లలో క్యాంటిన్ మేనేజర్ అయ్యాడు. నెల జీతం18 రూపాయల నుంచి 200 రూపాయలకు పెరిగింది. హెచ్‌ఓసీలో పని చేస్తూనే వ్యాపారం, మేనేజ్‌మెంట్ స్కిల్స్‌బాగా నేర్చుకున్నాడు.
ముంబైలో
ఆ రోజుల్లో ఉడిపి నుంచి బతుకుదెరువు కోసం చాలామంది ముంబైకి వెళ్లేవాళ్లు. ఆ రోజుల్లో ముంబైలో దోసెలు దొరికేవి కావు. అందుకని ముంబైకి వెళ్లేటప్పుడు కొన్ని దోశెలు తీసుకుని వెళ్లేవాళ్లు. అలా.. ఉడిపి వాళ్లు ముంబైకి మసాలా దోసె పరిచయం చేశారు. అవి ముంబై వాసులకు బాగా నచ్చేవి. అందుకే ముంబైలో సౌత్ ఇండియన్ ఫుడ్‌హోటల్ మొదలుపెట్టాలి అనుకున్నాడు జయరాం. కానీ.. సిటీలో అప్పటికే చాలా హోటళ్లలో సౌత్‌ఇండియన్ ఫుడ్ అమ్ముతున్నారు. అందుకే ఆ ఆలోచనను వెనక్కి తీసుకున్నాడు.
ఢిల్లీలో వ్యాపారం
సొంతంగా బిజినెస్ పెట్టాలనే ఆలోచన ఎప్పుడూ అతని మదిలో మెదులుతుండేది. అందుకే హెచ్‌ఓసీలో ఉద్యోగం వదిలేసి.. 1973లో ఢిల్లీకి వెళ్లిపోయాడు. అక్కడ అతని సోదరుడు ఉడిపి రెస్టారెంట్‌లో మేనేజర్‌గా పనిచేసేవాడు. ఢిల్లీకి వెళ్లాక అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అదే టైంలో ఘజియాబాద్‌లో ప్రభుత్వం సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్)ని మొదలుపెట్టింది. అప్పుడే1974లో జయరాం రెండువేల రూపాయల పెట్టుబడితో సీఈఎల్‌లో క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అతని కెరీర్‌లో అది పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ క్యాంటిన్‌లో అతను ముగ్గురు వంటవాళ్లను పెట్టుకున్నాడు. కస్టమర్లకు క్వాలిటీ ఫుడ్‌ఇచ్చాడు. క్వాలిటీ మాత్రమే కాదు.. రుచి కూడా అదిరిపోయేది. అలా చాలా తక్కువ టైంలోనే మంచి పేరొచ్చేసింది.
దోసెల వ్యాపారంలోకి..
అప్పట్లో ఢిల్లీలో కొన్ని హోటళ్లలో దోసెలు దొరికేవి. అక్కడివాళ్లు కూడా దోసెలను బాగానే తినేవాళ్లు. కానీ.. వాస్తవానికి ప్రామాణికమైన దోసెలు లోధిలోని ‘వుడ్‌ల్యాండ్స్’, అంబాసిడర్ దగ్గర ఉన్న ‘దాసప్రకాశ’ హోటళ్లలోనే అందుబాటులో ఉండేవి. ఈ రెండు చాలా ఖరీదైన రెస్టారెంట్లు. అందుకే ధరలు చాలా ఎక్కువ ఉండేవి. తక్కువ ధరకు దోసెలు అమ్మగలిగితే.. బిజినెస్ బాగా నడుస్తుందని జయరాంకి అనిపించింది. అందుకే దోసె బిజినెస్ చేయాలని అనుకున్నాడు. వుడ్‌ల్యాండ్స్‌లో దొరికే క్వాలిటీ ఇడ్లీలు, దోసెలను స్ట్రీట్ చాట్ ధరలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్4 , 1986న ఐదువేల రూపాయల పెట్టుబడితో ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ మార్కెట్‌లో మొదటి రెస్టారెంట్ మొదలుపెట్టాడు. దానికి ‘సాగర్’ అని పేరు పెట్టాడు. అక్కడ 40- మంది కూర్చుని తినే వీలుండేది. అందులో సౌత్‌ఇండియన్ వెజ్‌వంటకాలను సర్వ్‌చేశారు. ముఖ్యంగా ఇడ్లీ, దోసె, సాంబార్ వంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు.
మొదట్లో నష్టాలు
మొదటి రోజు 408 రూపాయల బిజినెస్ మాత్రమే అయ్యింది. ఆ తర్వాత కూడా అంతగా లాభాలు రాలేదు. కానీ.. అతను రెస్టారెంట్‌పెట్టిన ప్లేస్‌కు వారానికి 3,250 రూపాయల అద్దె చెల్లించాలి. దాంతో కొన్ని రోజులు బాగా నష్టాలు వచ్చాయి. ఎంత నష్టం వచ్చినా క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్‌కాలేదు. రోజూ ఉదయం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి వరకు విసుగు, విరామం లేకుండా పనిచేశాడు. దాంతో మెల్లగా గిరాకీ పెరిగింది. తక్కువ ధరకే క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారనే విషయం ఆ నోటా ఈ నోటా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్లకు తెలిసింది. దాంతో కస్టమర్లు రావడం పెరిగింది. కొన్నిసార్లు హోటల్‌లో కస్టమర్లు కూర్చునేందుకు కుర్చీలు కూడా సరిపోయేవి కావు. దాంతో కొన్నాళ్లకు సీటింగ్ కెపాసిటీ పెంచాల్సి వచ్చింది. దాంతో రెస్టారెంట్‌పైన ఫ్లోర్‌లో ఉన్న ప్లేస్‌ని అద్దెకు తీసుకున్నాడు. కొన్నాళ్లకు ఆ ప్లేస్‌కూడా సరిపోలేదు. ‘సాగర్’కు పెరుగుతున్న ఆదరణ వల్ల రెస్టారెంట్ బయట బారులు తీరిన ‘క్యూ’ లైన్లు కనిపించేవి.
వుడ్‌ల్యాండ్స్‌కొని..
నాలుగేండ్లలోనే జయరాం బాగా డబ్బులు సంపాదించాడు. ఆ డబ్బుతో1991లో వుడ్‌ల్యాండ్స్‌హోటల్ కొన్నాడు. వాస్తవానికి డిఫెన్స్ కాలనీలో ఈ హోటల్‌మాత్రమే జయరాం వ్యాపారానికి పోటీ ఇచ్చేది. అలాంటిది ఆ హోటల్‌నే కొనేశాడు. దాంతో అక్కడ సాగర్ రెస్టారెంట్‌కి ఎదురు లేకుండా పోయింది. వుడ్‌ల్యాండ్స్‌ని కొన్న తర్వాత దాని లుక్ పూర్తిగా మార్చేశాడు. అప్పట్లోనే 50,000 రూపాయలు ఖర్చు చేసి ఫర్నీచర్ చేయించాడు. హోటల్‌కి ‘సాగర్‌రత్న’ అని పేరు పెట్టాడు. అంతేకాదు.. అంతకుముందు సాగర్ రెస్టారెంట్‌లో ఉన్న ధరల కంటే 20 శాతం పెంచాడు. తర్వాత ‘సాగర్ రత్న’ బ్రాండ్ కూడా చాలా స్పీడ్‌గా పబ్లిక్‌లోకి వెళ్లింది. తక్కువ టైంలో మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కొత్త బ్రాంచీలు పెట్టి.. బిజినెస్ ఎక్స్‌పాండ్ చేశాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా100కుపైగా సాగర్‌రత్న ఔట్‌లెట్లు ఉన్నాయి. ఈ రెస్టారెంట్లకు సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా వెళ్తుంటారు. అంతెందుకు అటల్ బిహారీ వాజ్‌పేయి లాంటి వాళ్లు కూడా ఇక్కడే తినేవాళ్లు!
ఫ్రాంచైజీ
సాగర్‌రత్న పేరు మార్మోగిపోవడంతో1999 నుంచి ఫ్రాంచైజీలు ఇవ్వడం మొదలుపెట్టారు. లుథియానాలోని హోటల్ మహారాజాలో మొదటి ఫ్రాంఛైజీ అవుట్‌లెట్‌ప్రారంభించారు. సాగర్ రత్న ఫ్రాంచైజీకి అవసరమైన కనీస పెట్టుబడి 60 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. పదిహేనేండ్లలో చండీగఢ్, మీరట్, గుర్గావ్‌తో పాటు చాలా సిటీల్లో ఫ్రాంచైజీ అవుట్‌లెట్లు వెలిశాయి. అంతెందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్‌లో కూడా ఈ రెస్టారెంట్లు ఉన్నాయి.
కోస్టల్ ఫుడ్
సాగర్ రత్న ఒక బ్రాండ్‌గా ఎదిగాక జయరామ్‌కి మరో ఐడియా వచ్చింది. సౌత్‌లో తినే అల్పాహారాన్ని నార్త్‌లో అమ్మితే సక్సెస్ అయినట్టే తీరప్రాంతం అయిన తన సొంతూరు ఉడిపిలో ఎక్కువగా తినే కోస్టల్‌ఫుడ్‌ని కూడా నార్త్‌కి పరిచయం చేస్తే సక్సెస్ వస్తుంది అనుకున్నాడు. వెంటనే సౌత్ ఇండియన్ సీఫుడ్ వంటలను ఢిల్లీకి పరిచయం చేసే పనిలోపడ్డాడు. డిఫెన్స్‌కాలనీలోని తన మొదటి సాగర్ రెస్టారెంట్‌కి కొద్ది దూరంలో మొదటి స్వాగత్ అవుట్‌లెట్ పెట్టాడు. ఆ ప్రాంతంలో సీఫుడ్ దొరకడం చాలా అరుదు. కాబట్టి ఈ ఎథ్నిక్ రెస్టారెంట్ వెంటనే సక్సెస్ అయ్యింది. ఇండియన్స్‌తోపాటు ఢిల్లీకి వచ్చే విదేశీయులు కూడా ఈ రెస్టారెంట్‌కి ఎక్కువగా వస్తుంటారు. సాగర్ రత్న లాగే స్వాగత్ రెస్టారెంట్ల చైన్ మొదలుపెట్టాడు జయరాం. ప్రస్తుతం ఢిల్లీతోపాటు ఇతర సిటీల్లో కూడా స్వాగత్ బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం మంగళూరు, చెట్టినాడ్, మలబార్ ప్రాంతాలతోపాటు మరికొన్ని ప్రాంతాల సీఫుడ్ వెరైటీలను ఈ రెస్టారెంట్లలో అందిస్తున్నారు.
గివింగ్ బ్యాక్
ఉడిపిలోని కర్కాలలో జయరామ్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మొదలుపెట్టిన సాగర్ రత్న రెస్టారెంట్‌లో 10 రూపాయలకే భోజనం పెడుతున్నాడు. కొన్నాళ్ల నుంచి ఆయన కొడుకు రోషన్ ఈ బిజినెస్ చూసుకుంటున్నాడు. ఇప్పుడు స్టార్- కేటగిరీ హోటళ్లు, బడ్జెట్ హోటళ్లు, పారిశ్రామిక సంస్థల్లో క్యాంటిన్లు, బేకరీలను కూడా జయరాం గ్రూప్ నడుపుతోంది. ప్యాక్‌డ్‌స్నాక్స్, ఊరగాయలు, రెడీ టు ఈట్ ఫుడ్స్‌కూడా దొరుకుతున్నాయి వీళ్ల బ్రాండ్‌లో. ఒకప్పుడు 18 రూపాయలకు జీతం ఉన్న జయరామ్ ఇప్పుడు10,000 మందికి పైగా ఉపాధి కల్పించాడు.
పెరుగుతున్న లాభాలు
సాగర్ రత్న, స్వాగత్ రెస్టారెంట్ల లాభాలు ప్రతి ఏడాది 20 నుంచి 25 శాతం పెరుగుతున్నాయి. 2000 సంవత్సరంలో సాగర్ రత్న టర్నోవర్ దాదాపు 12 కోట్ల రూపాయలు ఉండేది. అది 2005 నాటికి 25 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం జయరాం బనన్ గ్రూప్ వార్షిక టర్నోవర్ 300 కోట్ల రూపాయలకు పైనే ఉందని చెప్తున్నారు.