పార్టీ మార్పు, పోటీపై గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ

నల్లగొండ జిల్లా : గత కొద్దిరోజులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతున్నారని వస్తున్న వార్తలకు ఆయన ఈరోజు స్పందించారు. వారి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ మారడం, లోక్ సభ ఎన్నికల్లో పోటీపై  క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో రకరకాల ఊహాగానాలు రావడం సర్వసాధారణమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆయన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి నల్గొండ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నాడని కొన్ని రోజులుగా మంథనాలు జరుగుతున్నాయి.  స్థానిక పరిస్థితులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు వల్ల గుత్తా అమిత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. 


ఓ ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం, నిర్మాణం లోపాల వల్లే నేతలు పార్టీ వీడుతున్నారని చర్చ నడుస్తోందని అన్నారు. గుత్తా అమిత్ రెడ్డి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.  గతంలో అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు ప్రతిపాదన వచ్చిందని ఆ తర్వాత ఎలాంటి చర్చ జరగలేదని గుత్తా తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం రెడ్డి నరేందర్ రెడ్డి వారికి సమీప బంధువు అని, ఆయనతో అమిత్ రెడ్డి భేటీ పెద్దగా ప్రాధాన్యత లేనిదని చెప్పుకొచ్చారు. ఆ భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని గుత్తా సుఖేందర్  రెడ్డి అన్నారు.  కాంగ్రెస్ 100 రోజుల పాలన విషయంలో  ప్రజల్లో సానుకూలత ఉందని ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయమని తెలిపారు.