నేను అధికారంలోనే లేను.. నిరంతరం పోరాటాలే చేసిన : బండి సంజయ్

 

  • తెలంగాణలో అత్యంత అవినీతిపరుడు గంగుల 

కరీంనగర్ సిటీ, వెలుగు: తాను అధికారంలో లేనని, నిరంతరం పోరాటాలే చేశానని, తానెట్లా అవినీతి చేస్తా? అని  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్​రూరల్​మండలం చామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ తానేమైనా గంగుల  లెక్క మంత్రినా? అధికారంలో ఉన్నామా? గుట్టలు మాయం చేశానా? భూములు కబ్జా చేసి కమీషన్లు  తీసుకున్నాన? అని మంత్రిపై గంగులపై ఫైర్​ అయ్యారు. తాను అవినీతికి పాల్పడితే ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వరు కదా... హెలికాప్టర్ ఇవ్వరు కదా అని అన్నారు.

తెలంగాణలో అత్యంత అవినీతిపరుడు గంగుల కమలాకరేనని అన్నారు.  అవినీతిలో తెలంగాణలో కరీంనగర్ టాప్ అని రాష్ట్ర ప్రభుత్వ నిఘా నివేదికలే చెబుతున్నాయన్నారు. అవినీతికి పాల్పడుతున్నందుకే గంగులకు బీఫాం ఇవ్వకుండా సతాయించారని ఆరోపించారు. ‘ గంగుల.. నువ్వే పౌర సరఫరాల శాఖ మంత్రివి కదా.. నీ చేతిలో పనే కదా కొత్త రేషన్​కార్డులు ఎందుకు ఇవ్వలేదు.. వడ్ల కొనుగోళ్లలో అక్రమాలు ఎందుకు ఆపలేదు.. ఎంతమంది బీసీలకు సాయం చేశావు’ అని ప్రశ్నించారు. జనం కోసం గంగుల ఒక్కరోజు పోరాడలేదన్నారు. 

తీగలగుట్టపల్లి వద్ద ఆర్వోబీ నిర్మించాలని ప్రజలు అడుగుతున్నా ఏనాడూ గంగుల పట్టించుకోలేదని తానే కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చానన్నారు. మోదీ ప్రభుత్వం 2.40 లక్షల ఇండ్లు మంజూరు చేయిస్తే కేసీఆర్ ప్రభుత్వం వాటిని నిర్మించలేదన్నారు. గంగుల ఓడిపోవడం ఖాయమని, మూడోస్థానానికి పడిపోతున్నాననే భయంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడన్నారు. లక్ష సెల్ ఫోన్లు, ఓటుకు రూ.10 వేలు ఇచ్చి గెలవాలని చూస్తున్నాడన్నారు. ప్రజల కోసం పోరాడే తను గెలిపించాలని,  తప్పుడు మాటలతో ప్రచారం చేసేవారికి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. 

బీజేపీలోకి మాజీ కార్పొరేటర్​

 కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ లీడర్​పెంట సత్యనారాయణ ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో శుక్రవారం బీజేపీలో చేరారు.  ఆయనతోపాటు సిటీలో పలు డివిజన్ల నుంచి సుమారు 500 మంది యువకులు బీజేపీలో చేరారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘు ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన లీడర్లు కరీంనగర్ వచ్చి బీజేపీలో చేరారు.