నా భూమి నాకు ఇప్పించండి

  •     సెల్ టవర్ ఎక్కిన యువకుడు

ఖమ్మం టౌన్,  వెలుగు :  ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హార్యంతండాకు చెందిన మంగిలాల్ తన భూమి తనకు ఇవ్వాలని  కోరుతూ శుక్రవారం గ్రామ శివారులో ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..  తండాకు చెందిన గుగులోతు నంద 2007లో తనకున్న ఎకరం భూమిని మంచుకొండ  గ్రామానికి చెందిన కొనకంచి సురేశ్​కు అమ్మాడు. ఆనాడే భూమికి సంబంధించిన లావాదేవీలు పూర్తయ్యాయి. సురేశ్ కొంతకాలానికి బానోతు రాము అనే వ్యక్తికి అమ్మాడు.  నంద కొడుకు మంగిలాల్ తన తండ్రి అమ్మిన భూమిలో 12 గుంటల భూమి అదనంగా ఉందని దాన్ని తనకు ఇప్పించాలని గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. 

సర్వే చేయించగా 7 గుంటల భూమి అదనంగా ఉందని తేలడంతో, తన భూమిని తనకు ఇప్పించాలని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు.  విషయం తెలిసిన  ఎస్సై కొండలరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  న్యాయం చేస్తామని ఎస్సై హామీ ఇవ్వడంతో మంగిలాల్ సెల్ టవర్ పైనుంచి కిందికి దిగాడు. మంగిలాల్​పై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సమాచారం.