
ఖానాపూర్/కడెం, వెలుగు: బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును ఆయన సందర్శించి మీడియాతో మాట్లాడారు. భారీ వరదలతో కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్లో పడినా రిపేర్లు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కడెం ప్రాజెక్టుకు కేసీఆర్‌తోనే ముప్పు ఉందన్నారు. గత వానాకాలంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం చెల్లించలేదన్నారు. అంతకుముందు ఆయన ఖానాపూర్ మండలం బీర్ నంది, సోమార్పేట, రంగాపేట గ్రామాల్లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించారు.
ఖానాపూర్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తపై ఉందన్నారు. ఈ సందర్భంగా రాథోడ్ రమేశ్ ఆధ్వర్యంలో బీర్ నంది మాజీ ఎంపీటీసీ రవి దంపతులు బీజేపీలో చేరారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో ఖానాపూర్ బీజేపీ మండల, పట్టణ అధ్యక్షుడు టేకు ప్రకాశ్, నాయిని సంతోష్, మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, నాయకులు ఎనగందుల రవి, బుచ్చన్న యాదవ్, మల్లయ్య , మహేందర్ తదితరులు పాల్గొన్నారు