అప్పు పైసలు అడిగినందుకు గొంతు కోసిండు!

నిర్మల్, వెలుగు: అప్పు తీసుకున్న పైసలు తిరిగి ఇవ్వాలని అడిగి నందుకు యువతిపై యువకుడు సర్జికల్ బ్లేడ్ తో దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది. సోఫీనగర్ కు చెందిన యువకుడు సంతోష్ కుటుంబం అదే కాలనీకి చెందిన దివ్య కుటుంబం వద్ద పెద్ద మొత్తంలో అప్పుగా తీసుకుంది. అప్పు తీసుకున్న పైసలు తిరిగి ఇవ్వమని అడుగుతుండగా రోజూ ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 

గురువారం దివ్య తల్లిపై సంతోష్ కుటుంబం దాడికి పాల్పడడంతో ఆమెకు తలకు గాయమైంది. చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం మినీ ట్యాంక్ బండ్ వద్ద దివ్యపై సంతోష్ సర్జికల్ బ్లేడ్ తో దాడి చేశాడు. దీంతో యువతి మెడపై తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. పోలీసులు వెళ్లి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ పోలీసులు తెలిపారు.